మహిళా ఎమ్మెల్యే దీక్ష.. రేవంత్ రెడ్డి మద్దతు

 

బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం మరో ఉద్యమం మొదలైంది. ఇంత కాలం వివిధ పార్టీలు, వర్గాలు స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉక్కు కర్మాగారం అంశాన్ని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ నేటికీ అమలుకు నోచుకోకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మహిళా నేత, ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ నిరసన దీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం పోరాడతానని గతంలో ప్రకటించిన హరిప్రియ ఇప్పుడు దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. అందుకు బయ్యారం వేదిక కానుంది. పార్లమెంట్‌ సమావేశాల ముగింపు రోజు ఈ నెల 13న బయ్యారంలో 36గంటల నిరసన దీక్షకు పూనుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపారు. మహాకూటమి, ఉక్కు సాధన కమిటీ మద్దతుతో ఎమ్మెల్యే ఈ దీక్షను చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. దీక్షలో భాగంగా ఎమ్మెల్యే 36 గంటల పాటు ఆహార పానియాలు స్వీకరించకుండా దీక్షకు దిగుతున్నట్లు మండల కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఇల్లెందు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కాంగ్రెస్‌ బలపర్చగా గెలుపొందిన 50మంది సర్పంచ్‌లు కూడా దీక్షలో పాల్గొనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు రాష్ట్రస్థాయి నాయకులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.