ప్రముఖ మెగా డైరెక్టర్ కన్నుమూత

 

ప్రముఖ దర్శకుడు, నిర్మాత, తెలుగు సినీ పరిశ్రమకు పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన మెగా డైరక్టర్ విజయ బాపినీడు ఇకలేరు. కొంత కాలంగా అల్జీమర్స్ తో బాధపడుతున్న విజయ బాపినీడు ఎవర్ని గుర్తించకపోవడమే కాకుండా, తన  సినిమా జీవితాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. విజయ బాపీనీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1936 సెప్టెంబర్‌ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. సీఆర్‌ఆర్‌ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించి సినిమా రంగం మీద మక్కువతో రచయితగా దర్శకుడిగా మారారు. నిర్మాతగానూ విజయం సాధించారు. మొత్తం 22 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్‌ బాబు చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు.

తెలుగులో 1982లో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన.. మగ మహారాజు, గ్యాంగ్‌లీడర్‌, ఖైదీ నం.786, బిగ్‌బాస్‌, మగధీరుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, మహానగరంలో మాయగాడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. రాజేంద్ర ప్రసాద్‌ లాంటి కామెడీ హీరోలతోనూ వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు. 1998లో సాయికుమార్ హీరోగా తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ చిత్రానికి ఆయన చివరిగా దర్శకత్వం వహించారు. అలాగే బొమ్మరిల్లు, విజయ, ఇండియన్‌ ఫిల్మ్‌, నీలిమ పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు. రాజాచంద్ర, దుర్గా నాగేశ్వరరావు, జి.రామమోహనరావు, మౌళి, వల్లభనేని జనార్దన్‌‌లను దర్శకులుగా పరిచయం చేశారు. అలాగే పాటల రచయితగా భువనచంద్రను, మాటల రచయితగా కాశీ విశ్వనాథ్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత బాపీనీడుదే.ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.