వైసీపీ ఇసుక ముఠా అక్ర‌మ మైనింగ్ పై సుప్రీం సీరియ‌స్

ఇసుక అక్రమ తవ్వకాల్ని తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా, అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపడుతూనే ఉన్నార‌ని, దీనికి సంబంధించి ఇసుక రవాణ చేస్తున్న వాహనాలతో పాటు ఫొటోలు, తేదీ, సమయంతో కూడిన ఆధారాలను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నాగేంద్ర కుమార్ సుప్రీం కోర్టు ముందు ఉంచారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కేవలం కాగితాలపైనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించవని న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా వ్యాఖ్యానించారు.

ఇసుక అక్ర‌మ మైనింగ్ ఏపీలో అధికార పార్టీ నేత‌ల‌కు ఎంత బిజినెస్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నేత‌లంతా సిండికేట్ అయి ఇసుక‌ను బంగారంలా ధ‌ర‌లు పెంచి అమ్ముకుంటూ వేల కోట్లు కొల్ల‌గొట్టిన ఆరోప‌ణ‌లపై సుప్రీం కోర్టు మ‌రోసారి సీరియ‌స్ అయ్యింది. అక్ర‌మ మైనింగ్ ఆపాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో పాటు కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి, అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతుందో లేదో నిర్ధారించాల‌ని ఆదేశించింది.   

గత ఏడాది కాలంగా రాష్ట్రంలో అక్రమంగా 20 మిలియన్‌ టన్నుల ఇసుకను తవ్వి తరలించి ఉంటారని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇసుకను బ్లాక్‌ మార్కెటింగ్‌ కిందకు తీసుకొచ్చి అమ్మడం ద్వారా 18 వేల కోట్లపైనే నేతలు వెనకేసుకొన్నారని ప్రముఖ జియాలజిస్ట్‌ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి చెబుతున్నారు. ఇందులో ఎవరి వాటా ఎంతో తేలాల్సి ఉందంటారాయ‌న‌.  గతంలో ఎన్నడూ లేనంతగా గత ఏడాదిగా అక్రమంగా ఇసుకను దోచుకున్నారని  ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 
 
సహజసిద్దంగా దొరికే ఇసుక విషయంలో జేపీ వెంచర్స్ పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తుల పెత్తనం సమంజసం కాదని పర్యావరణవేత్తలు అంటున్నారు. "ప్రభుత్వం చెబుతున్న దానికి విరుద్ధంగా పెద్ద పెద్ద యంత్రాల సహాయంతో నదీ గర్భాన్ని కొల్లగొడుతున్నారు. టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నారు. వాటివల్ల నదీ ప్రవాహాల్లో వేగం, దిశ కూడా మారిపోతున్నాయి. పర్యావరణ హననం జరుగుతోంది. వాటికి అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇసుక పేరుతో నదులను ఇష్టారాజ్యంగా తొలిచేస్తే తీవ్ర నష్టం తప్పదు’’ అని పర్యావరణ‌వేత్త ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. లాభాల కోసం ప్రైవేట్ వ్యక్తులు జరుపుతున్న తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వివాదాలకు కేంద్రంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 6 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపితే అక్రమంగా తరలిస్తున్న 6.36 లక్షల టన్నుల ఇసుక పట్టుబడడం గమనిస్తే ఏపీలో ఇసుకని అక్రమార్కులు ఏ తీరున పక్కదారి పట్టిస్తున్నారో అర్థమవుతుంది. పట్టుబడిన ఇసుకనే అంత పెద్ద మొత్తంలో ఉంటే అధికారులకు చిక్కకుండా తరలిపోయింది ఎంత ఉంటుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

- ఎం.కె. ఫ‌జ‌ల్‌