విశాఖ నుంచి మొదలైపోయిన పాలన..! మంత్రుల రివ్యూస్ తో రాజధాని కళ
posted on Feb 3, 2020 9:19AM

విశాఖకు రాజధాని కళ వచ్చేసింది. ఇప్పటికే... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల విజిట్స్ పెరగడంతో విశాఖలో రాజధాని హడావిడి కనిపిస్తోంది. మంత్రులు బొత్స, అవంతి, అనిల్, వెల్లంపల్లి, కృష్ణదాస్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పదేపదే విశాఖ వస్తూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక, స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా వీలు దొరికితే విశాఖలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఒకవైపు మంత్రులు... మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేల విజిట్స్ తో విశాఖలో రాజధాని కళ కనిపిస్తోంది. అయితే, విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించిన జగన్ ప్రభుత్వం ....దానికి కార్యరూపం ఇచ్చేందుకు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రాజధాని వీకేంద్రకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో అడ్డంకులను అధిగమించి విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు అడుగులు వేస్తోంది.
ఇదిలాఉంటే, కార్యనిర్వాహక రాజధాని విశాఖలో ఆయా శాఖల కార్యాలయాలకు అనువైన ప్రాంతాలను, భవనాలను వెదికే పనిని ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్య నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక, సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సెక్రటేరియట్ వరకు వివిధ కార్యాలయాల ఏర్పాటుకు పలు భవనాలను పరిశీలించిన ప్రభుత్వ పెద్దలు... రుషికొండలో సచివాలయం ఏర్పాటుకు దాదాపు ఖరారు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇటీవల రుషికొండలో పర్యటించిన విజయసాయిరెడ్డి... ఆ మేరకు స్థానిక నేతలకు సంకేతాలిచ్చారు. మరోవైపు, సీఎం క్యాంపు కార్యాలయం, గవర్నర్ బంగ్లా కోసం సర్క్యూట్ హౌస్, పోర్ట్ గెస్ట్ హౌస్, ఆఫీసర్స్ క్లబ్, వాల్తేర్ క్లబ్‌తోపాటు ఏయూలో పలు భవనాలను పరిశీలించారు. అలాగే, ఏయూ, పోర్టు, జీవీఎంసీ, ఆర్ అండ్ బీ, వీఎమ్ఆర్డీఏ పరిధిలో ఉన్న స్థలాలను, భవనాలను పరిశీలిస్తున్నారు.
అయితే, ఇప్పుడు సర్క్యూట్ హౌస్‌ను బ్రిటీష్ కాలంలో గవర్నర్ బంగ్లాగా వాడేవారు. అలాగే, వాల్తేర్ క్లబ్ కూడా అప్పటి అధికారుల క్యాంపు కార్యాలయంగా ఉండేది. ఈ రెండింటిని ఇప్పుడు కూడా వాటికే వాడాలని భావిస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రైవేట్ హోటల్స్, గెస్ట్ హౌస్ లను కూడా పరీశీలించారు. అయితే, భద్రత, పార్కింగ్, విద్యుత్, ఇతర మౌలిక వసతులను పరిగణలోనికి తీసుకుంటున్నారు. మొత్తానికి, అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి మూడో వారం నుంచే విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.