తిరుమలలో అంగరంగ వైభవంగా మినీ బ్రహ్మోత్సవాలు
posted on Feb 4, 2025 9:30AM

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన తరువాత శుద్ధ దశమిని రథసప్తమిగా భావిస్తారు. తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని మినీ బ్రహ్మోత్సవంగా పరిగణిస్తారు. తిరుమలేశుడు సప్తవాహనాలపై మాడ వీధులలో విహరిస్తారు. సూర్యోదయం నుంచి ఈ వాహన సేవ ప్రారంభమౌతుంది. అందులో భాగంగానే మంగళవారం (ఫిబ్రవరి 4) తిరుమలేశుడు తిరుమల మాడ వీధులలో సూర్య ప్రభ వాహనంపై విహరించారు. రాత్రి 9 గంటలకు చంద్ర ప్రభ వాహన సేవతో రథ సప్తమి ఉత్సవాలు ముగుస్తాయి. రథ సప్తమి ఉత్సవాలు ఒక తిరుమలలోనే కాకుండా టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు తొమ్మిది ఆలయాలు, దేవుని కడప, ఒంటిమిట్ట కోదండరామాలయాల్లో కూడా ఘనంగా జరుగుతున్నాయి.
ఇక తిరుమలలో వేంకటేశ్వరస్వామి వాహన సేవల సమయం ఇలా ఉంది. సూర్యోదయం నుంచి ఎనిమిది గంటల వరకూ సూర్యప్రభ వాహన సేవ, ఉదయం 9 గంటల నుంచి చిన్న శేష వాహన సేవ, 11 గంటల నుంచి 12 గంటల వరకూ గరుడ వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ హనుమంత వాహన సేవ, రెండు గంటల నుంచి మూడు గంటల వరకూ చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ కల్ప వృక్ష వాహన సేవ, ఆరు గంటల నుంచి 7 గంటల వరకూ సర్వభూపాల వాహన సేవ నిర్వహిస్తారు. ఇక చివరిగా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకూ శ్రీవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. దాంతో తిరుమలలో రథ సప్తమి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ రథ సప్తమి ఉత్సవాలు ఒక్క తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రమే కాదు.. శ్రీవైష్ణవ ఆలయాలన్నిటిలోనూ ఘనంగా జరుగుతున్నాయి. రథ సప్తమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.