అలజడి సృష్టించిన అల్లు అర్జున్‌

పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను ఉద్దేశించి అల్లు అర్జున్‌ వ్యాఖ్యలు చేసి రెండు రోజులు గడిచినా కూడా ఇంకా ఆ సెగ రగులుతూనే ఉంది. వెబసైట్లలోనూ, సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్ వ్యాఖ్యల గురించి ప్రతివ్యాఖ్యలు జోరుగా సాగుతున్నాయి. వివాదాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ ఇంత తీవ్ర సుడిగుండంలో కోరి కోరి చిక్కుకున్నాడా అంటే ఔననే విశ్లేషణే వినిపిస్తోంది. హీరోల కుటుంబాల నుంచి కథానాయికలు వచ్చే సంప్రదాయం తెలుగులో చాలా తక్కువ. అలాంటి ప్రయత్నం చేసిన అతికొద్దిమంది కూడా అభిమానులకు జంకో, తెరమీద నిలదొక్కుకోలేకనో ఎప్పుడో కనుమరగైపోయారు. అలాంటిది, మెగాఫ్యామిలీ నుంచి నీహారిక అనే నాయిక వస్తోందనగానే ఎవరూ ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఇప్పటికే నీహారిక, టీవీ ద్వారా తనకంటూ ఒక భూమికను ఏర్పరుచుకున్నారు. అలాంటి నీహారికను సినీరంగానికి పరిచయం చేస్తూ జరిగిన ఓ ఆడియో ఫంక్షన్‌, ఓ వివాదానికి వేదికగా మారడమే ఆశ్చర్యం. 


నీహారిక ‘ఒక మనసు’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన అల్లు అర్జున్‌ వేదిక మీదకు రాగానే ఒక్కసారిగా పవన్‌ కళ్యాణ్‌ గురించిన నినాదాలు మొదలయ్యాయి. మెగాఫ్యామిలీకి సంబంధించి ఏ వేడుక జరిగినా ఇలాంటి నినాదాలు వినిపించడం కొత్తేమీ కాదు. అయితే అది శృతి మించడమే తాజా వివాదానికి కారణమైంది. దానికి తోడు కొన్నాళ్లుగా అల్లు అర్జున్‌, పవన్‌ గురించి మాట్లాడను అని భీష్మించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అయితే అర్జున్‌ ఈసారి తను ఈ వివాదానికి ఒక ముగింపుని పలకాలని నిశ్చయించుకుని మరీ వేదిక మీదకు వచ్చినట్లుంది. అవతలివారికి నచ్చినా, నచ్చకున్నా పది నిమిషాలకు పైగా తన మనసులోని అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పేశాడు అల్లు.

 

పవన్‌ కళ్యాణ్‌కు చెందిన కొందరు అభిమానులు ఒక గుంపుగా చేరి ఎక్కడపడితే అక్కడ నినాదాలు చేస్తూ శృతి మించుతున్నారన్నది అల్లు అర్జున్‌ వాదన. ఇలాంటి నినాదాల వల్ల వేడుకల ఫంక్షన్ల అజెండా మారిపోతోందన్నది అర్జున్‌ ఆరోపణ. ఏదో మాట్లాడాలని వచ్చినవారంతా బలవంతంగా పవన్‌ను పొగడాల్సి వస్తోందన్నది అతని ఆవేదన. అల్లు అర్జున్‌ చెప్పిన మాట జనానికి కొత్తేమీ కాదు. గత రెండేళ్లుగా ఈ తంతు సాగుతున్నదే! పవన్‌ కళ్యాణ్‌ గురించిన నినాదాలు, ఆయనను బలవంతంగా పొగిడే కోటరీలు జనాలకి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుడే ఈ విషయాన్ని ఖండించడం ఓ కొత్త వివాదానికి దారి తీసింది. అడియో ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ చేసిన ప్రసంగం అప్పటికప్పుడు అనుకున్నది కాదని అర్థమైపోతోంది. నాగబాబు హావభావాలు చూసినప్పుడు అల్లు అర్జున్‌ ప్రసంగానికి పెద్దలు మురుసుకున్నారనీ తేలిపోయింది. కానీ ఇది మెగాఫ్యామిలీలో ఒక చీలికను తేనుందా అన్నదే ఓ ఆసక్తికరమైన ప్రశ్న.

 

తామంతా ఒక్కటే అని అల్లు అర్జున్‌ ఎంతగా చెప్పినా ఇప్పటికే సోషల్ మీడియాలో దూషణల పర్వం మొదలైపోయింది. అభిమానులు గొడవ చేస్తుంటే ఇన్నాళ్లూ పవన్‌ ఎందుకని స్తబ్దుగా ఉన్నారని ఒక వర్గం అంటే, పవన్‌కి ఉన్న ప్రజాదరణను తట్టుకోలేని అల్లు ఈర్ష్యతో ఈ వ్యాఖ్యలు చేశారని మరో వర్గం అంటోంది. పవన్‌, చిరంజీవి రాజకీయ దారులు వేర్వేరు అయినప్పటి నుంచి వారి అభిమానులు కూడా ఎవరికి వారుగా చీలిపోయారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో తామంతా చిరంజీవికే మద్దతునిస్తామని మెగా వారసులంతా ప్రకటించడంతో, ఈ చీలికలో ఒక స్పష్టత వచ్చేసింది. చిన్నప్పటి నుంచీ చిరంజీవిని చూస్తూ, ఆరాధిస్తూ... ఆయన ఏర్పరిచిన దారి మీద నడుచుకుంటూ వచ్చిన మెగా హీరోలందరికీ ఆయనంటే ఎంత అభిమానమో చెప్పనక్కర్లేదు. వీరి తొలి మద్దతు చిరంజీవికే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి ఈ మెగాఫ్యామిలీలో పవన్‌ ఎంతవరకు ఇమడుతారన్నదే సందేహం! ఒక వేడుకకి వెళ్లి, ఒక వేడుకకి వెళ్లకా ఇప్పటికే పవన్ కావల్సినన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నారు.

 

పవన్‌ ఎందుకు రాలేదు అని అభిమానులు అడిగే ప్రశ్నలకు, మెగా ఫ్యామిలీ తల పట్టుకుంటోంది. అలాగని పవన్‌ వేడుకలకు దూరంగా ఉంటారా అంటే అదీ లేదు. అకస్మాత్తుగా ఏదో ఒక ఆడియో ఫంక్షన్లో హాజరై, ఫలానా హీరా నా తమ్ముడులాంటివాడు అనేస్తారు. సహజంగానే ఈ దోబూచులాట మెగా ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించక మానదు. అందుకే అల్లు అర్జున్‌ తన మనసులో ఉన్న చికాకునంతా పవన్‌ అభిమానుల మీద వెళ్లగక్కినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్‌ ప్రస్తావించిన సమస్య కేవలం మెగా ఫ్యామిలీకే పరిమితం కాదు. నందమూరి ఫంక్షన్లలో కూడా బాలకృష్ణ గురించి ఇలాంటి నినాదాలే వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో నందమూరి వారసులు కొందరు అల్లు అర్జున్‌లాగానే కొంత అసహనానికి లోనైన సంఘటనలు జరిగాయి. కానీ ఈ మొత్తం ప్రహసనంలో నష్టపోయేది అభిమానులే. తెలుగునాట ఒకప్పుడు అభిమాన సంఘాలు చాలా ఉధృతంగా ఉండేవి. వేర్వేరు కథానాయకుల అభిమానులకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. అలాంటి దుస్థితే ఇప్పుడు మళ్లీ తలెత్తుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఒకే కుటుంబానికి చెందిన నటుల అభిమానుల మధ్య చిచ్చు రాజుకోవడం తలబాదుకోవల్సిన విషయం! మరి ఈ విషయమై పవన్‌ కళ్యాణ్‌ ప్రతిస్పందిస్తారా, లేక చిరునవ్వులు చిందిస్తారా అన్నది వేచి చూడాలి.