700కి చేరిన మక్కాలో మృతుల సంఖ్య
posted on Sep 24, 2015 8:59PM
.jpg)
సౌదీ అరేబియాలో ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాకు సుమారు మూడు కి.మీ. దూరంలో ఉన్న మైన పట్టణంలో గురువారం ఉదయం జరిగిన త్రొక్కిసలాటలో 717 మంది మరణించారు. సుమారు 800మందికి పైగా గాయపడ్డారు. ప్రతీ ఏటా జరిగే హజ్ యాత్రలో భాగంగా మైన వద్దగల మూడు స్తంభాలను రాళ్ళతో కొట్టే ఆచారం పాటిస్తారు. దానిలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుండి సుమారు 20 లక్షల ముస్లిములు వచ్చేరని సౌదీ ప్రభుత్వం అంచనా.
గురువారం ఉదయం ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒకేసారి జనం ముందుకు త్రోసుకు రావడంతో చాలా మంది క్రింద పడిపోయారు. ఆ త్రొక్కిసలాటలో ఇంత వరకు 717మంది మరణించినట్లు సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు ప్రకటించారు. సంఘటాన స్థలంలో సుమారు 4,000 మంది సిబ్బందిని, 220 అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేసి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
1990సం.లో ఇదే ప్రదేశంలో 1426 మంది త్రోక్కిసలాటలో మరణించారు. ఆ తరువాత కూడా చాల సార్లు అదే ప్రదేశంలో త్రొక్కిసలాటలో చాలా మంది చనిపోతూనే ఉన్నారు. కానీ మళ్ళీ ఒకేసారి ఇన్ని వందలమంది చనిపోవడం ఇదే మొదటిసారి. ఇటువంటి సంఘటనలు నివారించదానికి సౌదీ ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ నానాటికీ యాత్రికుల సంఖ్య అంచనాలకు మించి చాలా భారీగా పెరిగిపోతుండటం ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం అవుతున్నాయి.