షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ: మాయ

 

తారాగణం: హర్షవర్ధన్ రాణే, అవంతికా మిశ్రా, సుష్మా రాజ్, నాగబాబు, ఝాన్సీ, సంగీతం: శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి, నిర్మాత: మధుర శ్రీధర్, దర్శకత్వం: నీలకంఠ.

 

‘షో’, ‘మిస్సమ్మ’ సినిమాల ద్వారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు నీలకంఠ వైవిధ్యమైన కథాంశాలతో చిత్రాలను రూపొందిస్తారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు రూపొందించిన సస్సెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘మాయ’. టీవీ ఛానల్ రిపోర్టర్‌గా పనిచేసే మేఘన (అవంతికా మిశ్రా)కి జరగబోయే సంఘటనలను ముందుగానే తెలిసిపోతూ వుండే మానసిక వ్యాధి వుంటుంది. ఆమె ఫ్యాషన్ డిజైనర్ సిద్ధార్థ (హర్షవర్ధన్ రాణే) ప్రేమలో పడుతుంది. అయితే సిద్ధార్థ మాత్రం మేఘన చిన్ననాటి స్నేహితురాలు పూజతో పెళ్ళి కుదుర్చుకుంటాడు. సిద్ధార్థ మొదటి ప్రియురాలు రోడ్డు ప్రమాదంలో మరణించిందన్న విషయం తర్వాత బయటపడుతుంది. ఇదిలా వుండగా తన స్నేహితురాలు పూజని సిద్ధార్థ చంపేయబోతున్నాడన్న విషయం జరగబోయే సంఘటనలు ముందే తెలిసిపోయే మేఘనకు తెలిసిపోతుంది. దాంతో ఆమె తన స్నేహితురాలిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నాల్లో అనేక వాస్తవాలు బయటపడతాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మాయ’ సినిమా దర్శకుడిగా నీలకంఠలోని మరో కోణాన్ని బయటపెట్టింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకున్నాయి.