పాపం మర్రి.. మళ్లీ మళ్లీ.. జగన్-రజనీ రాజకీయాలకు బలి!
posted on Apr 20, 2022 4:45PM
మర్రి రాజశేఖర్. ఈ చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. జగనన్న చేతిలో పదే పదే మోస పోతున్న బాధితుడిగా ఆయనపై అందరికీ సానుభూతి కూడా ఉంది. ఒకటి రెండుసార్లు కాదు.. రజనీ కోసం జగన్‌రెడ్డి ఆయనకు పలుమార్లు హ్యాండ్ ఇచ్చారు. అనేక సార్లు మాటతప్పి, మడమ తిప్పారు. పదవులు ఇచ్చేందుకు ముందుకురాని జగనన్న.. పార్టీ పనుల్లో వాడుకోవడానికి మాత్రం మర్రి గుర్తుకొచ్చారని అంటున్నారు. తాజాగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వైసీపీ సమన్వయ బాధ్యతలు ఆయనకు అప్పగించారు.
విడదల రజనీ కోసం.. వైసీపీ నుంచి ఎమ్మెల్యే సీటు వదులుకుంటే.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, మర్రి రాజశేఖర్‌ను మంత్రిగా చేస్తానని గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ చిలకలూరిపేట నడిబొడ్డున నిలబడి హామీ ఇచ్చారు. ఆ ప్రాంతంలో బలమైన నాయకుడిగా, పార్టీకి మొదటినుంచీ దన్నుగా ఉన్న మర్రిని కాదని రజనీ వైపు జగన్ మొగ్గు చూపడం వెనుక పెద్ద మొత్తంలో డీల్ జరిగిందని కూడా అంటారు. అందుకే, ఆమె కోసమే.. ఎమ్మెల్సీ హామీతో మర్రి రాజశేఖర్‌ను పక్కన పెట్టేసి.. రజనీని ఎమ్మెల్యేను చేశారు. పోనీ.. ఇచ్చిన మాటైనా నిలబెట్టుకున్నారా అంటే అదీ లేదు. గత మూడేళ్లుగా.. పలుమార్లు, పదుల సంఖ్యలో ఎమ్మెల్సీలనైతే ఎంపిక చేశారు కానీ.. అందులో మర్రి రాజశేఖర్ పేరు మాత్రం ఉండేది కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల పేరు వినిపించినప్పుడల్లా.. మర్రికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరిగేదు. రేసులో ఆయన అందరికంటే ముందుండేవారు. కానీ, ఇప్పటి వరకూ ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇక మంత్రి ఎలా చేస్తారు? ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. మర్రికి ఇస్తానన్న మంత్రి పదవిని.. ఆయన ప్రత్యర్థి రజనీకి ఇచ్చి.. ఆమెను మినిస్టర్‌గా మరింత అందలం ఎక్కించారు. విశాఖ జిల్లా పార్టీ ఇంఛార్జిగానూ నియమించి మరింత ప్రాధాన్యం, ప్రమోషన్ కల్పించారు. కానీ, మర్రిని ఇంకా ఎమ్మెల్సీనే చేయలేదు జగన్‌రెడ్డి. బహుషా కమ్మ కావడమే ఆయనకు శాపంగా మారిందేమో అంటున్నారు.
మర్రి రాజశేఖర్‌కు ఇంతగా అన్యాయం చేసిన జగనన్న.. తాజాగా పార్టీ పదవుల్లో ఆయన అనుభవాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వ పదవులేమో రజనీకి.. పార్టీ బాధ్యతలు, పనులేమో మర్రికి. రజనీని ఏకంగా మంత్రిని చేశారు.. మర్రికి ఇంకా ఎమ్మెల్సీనే ఇవ్వలేదు కానీ, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ సమన్వయ బాధ్యతలు అప్పగించి ఆయనతో ఊడిగం చేయించుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. కొడాలి నాని మినహా.. వైసీపీలో కమ్మ వర్గీయులకు ఇంతకంటే ప్రాధాన్యం ఏం ఆశించగలమని చెబుతున్నారు. మర్రి రాజశేఖర్‌ను మంత్రిని చేయడం ఏమో గానీ.. కనీసం ప్రజల మధ్య, ప్రజల సాక్షిగా ఇచ్చిన ఎమ్మెల్సీ హామీనైనా నెరవేర్చు జగనన్నా.. అంటున్నారు చిలకలూరిపేట వైసీపీ నాయకులు. అన్నీ రజనీకేనా.. మర్రిని మోసం చేయొద్దని అంటున్నారు.