మాస్క్ మస్ట్... మళ్లీ కమ్మేస్తున్న కరోనా!
posted on Apr 20, 2022 3:57PM
దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని స్తంభింప చేసిన మహమ్మారి కోవిడ్ శాంతించిందని ఊపిరి పీల్చుకునే లోపే మరో సారి కమ్మేయనుందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం రోజులుగా హస్తినసహా పలు నగరాలలో కరోనా సోకిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
చైనాలో పుట్టి ప్రపంచాన్ని కమ్మేసిన ఈ మహమ్మారి భారత్ పైనా పెను ప్రభావం చూపింది. మూడు ధఫాలుగా గడగడలాడించిన కరోనా తొలి రెండు దఫాలలో మరణ మృదంగాన్ని ఆలపించిందనే చెప్పాలి. లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. మూడో ధఫా ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో విరుచుకు పడనప్పటికీ పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు. ఒమిక్రాన్ బారిన పడిన వారిలో స్వల్ప లక్షణాలే కనిపించాయి. త్వరగానే కోలుకున్నారు. అయితే ఫోర్త్ వేవ్ తప్పదన్నఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.
మూడో వేవ్ ముగిసిన తరువాత దేశంలో క్రమంగా కరోనా నిబంధనలను ఎత్తి వేశారు. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ మాస్కుల వాడకం తప్పని సరి అన్న కండీషన్ ఎత్తి వేస్తూ అది ఇచ్చికమని ప్రకటించారు. అయితే కరోనా ముప్పు పూర్తిగా సమసి పోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. అన్నట్లుగానే మళ్లీ చైనాలో మొదలైన కరోనా విజృంభణ ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. బ్రిటన్, అమెరికాలలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా భారత్ లో సైతం కరోనా వ్యాప్తి తీవ్రత పెచ్చరిల్లింది. ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఆందోళన కర స్థాయికి చేరుకుంది. గడచిన వారం రోజుల్లో ఢిల్లీలో కరోనా వ్యాప్తి వేగం మూడు రెట్లు పెరిగింది. పాజిటివిటీ రేటు 7 శాతం దాటేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కరోనా ఆంక్షలు విధించించి మాస్కు ధారణ తప్పని సరి చేస్తూ ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. హస్తినలో వ్యాప్తి తీవ్రతను బట్టి చూస్తే ఇది దేశం నలుమూలలకూ పాకేందుకు ఎంతో కాలం పట్టదని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో సారి దేశమంతా కరోనా ఆంక్షల చట్రంలోనికి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు. ఇలా ఉండగా ఢిల్లీలో కరోనా వ్యప్తిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కార్ కూడా మాస్కు ధారణను తప్పని సరి చేస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.