ఏపీ సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు.. కడప జిల్లా వ్యక్తిపై కేసు
posted on Feb 27, 2020 10:34AM

ఏపీలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుంటూ చెలరేగిపోతున్న సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలోనే ఆయనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప జిల్లా మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి సీఎం జగన్ ను ఉద్దేశించి అసభ్యకరంగా రూపొందించిన ఓ టిక్ టాక్ వీడియాను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశాడు. దువ్వూరు మండలం పెద్ద జొన్నవరానికి చెందిన పుల్లయ్య పెట్టిన పోస్టు వైరల్ అవుతుండటంతో స్ధానిక వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సైబర్ క్రైమ్ అధికారుల సాయంతో ఈ టిక్ టాక్ వీడియో ఎప్పుడు పోస్టు చేశారు. పుల్లయ్య వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.