ఢిల్లీ పీఠం బీజేపీదే.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా

ఢిల్లీ అసెంబ్లీకి  బుధవారం (ఫిబ్రవరి 5) ఎన్నికలు జరిగాయి. ఓటరు తన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ పోల్స్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమనే అంచనా వేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయాన్ని ప్రిడిక్ట్ చేస్తే ఒక్క కేకే సర్వే మాత్రం ఢిల్లీ పీఠంపై మళ్లీ ఆప్ జెండాయే ఎగురుతుందని ఢంకా బజాయించి మరీ చెప్పింది. 

ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36. 
పీ మార్గ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం  బీజేపీకి 39 నుంచి 49 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 21 నుంచి 31 స్థానాలు దక్కు అవకాశం ఉంది. కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానంలో గెలిచే అవకాశం ఉంది. అలాగే పీపుల్స్ పల్స్, జేవీసీ పోల్, పీపుల్స్ ఇన్ సైట్, చాణక్యా స్ట్రాటజీస్ సహా పలు సంస్థలు కూడా తమతమ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ విజయమే ఖరారైందని పేర్కొన్నాయి. అయితే మార్జైజ్ సర్వే మాత్రం ఢిల్లీలో హండ్ ఏర్పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది.  

ఇవి కాకుండా మైండ్ బ్లింక్, మరో సంస్థ నిర్వహించిన సర్వేలు ఆప్ ఢిల్లీలో మూడో సారి అధికారం చేజిక్కించుకునే అవకాశాలున్నయని అంచనా వేశాయి.   అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి దళితుల నుంచి గట్టి మద్దతు లభించిందనే పేర్కొన్నాయి. అలాగే మహిళా ఓటర్లు మొగ్గు కూడా ఒకింత అధికార పార్టీవైపే కనిపించిందని చెప్పారు.  

ఇక కచ్చితమైన సర్వేలకు పెట్టింది పేరుగా చెప్పుకునే కేకే సర్వే మాత్రం ఢిల్లీలో ఆప్ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు కైవశం చేసుకోవడం ఖాయమని పేర్కొంది. ఆ సర్వే ప్రకారం ఆప్ కచ్చితంగా 39 స్థానాలలో విజయం సాధిస్తుంది. బీజేపీకి 22 స్థానాలలో విజయం దక్కుతుంది. ఇక మిగిలిన తొమ్మిది స్థానాలలో పోరు హోరాహోరీగా ఉంటుంది. వాటిలో కూడా ఓ ఐదు స్థానాలలో మొగ్గు ఆప్ వైపే ఉంది. మిగిలిన నాలుగు స్థానాలలో బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయి. అంటే కేకే సర్వే ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీకి 44, బీజేపీకి 26 స్థానాలు దక్కుతాయి.  వాస్తవంగా ఢిల్లీ పీఠం ఏ పార్టీకి దక్కుతుందో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకూ వేచి చూడాల్సిందే.