మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన మద్దతు ఉపసంహరణ

 

మహారాష్ట్రలో బీజేపీ-శివసేనలు మిత్ర పక్షాలుగా ఉన్నాయి. శివసేన మద్దతుతో కొనసాగుతున్న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో శివసేనకు చెందినవారు మంత్రులుగా ఉన్నారు. కానీ రెండు రోజుల క్రితం ముంబైలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంతో మొదలయిన వివాదం ఆ రెండు పార్టీల మధ్య విభేదానికి దారి తీసింది. దానితో ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి తన మంత్రులను వెనక్కి తీసుకొని, దానికి తమ మద్దతు ఉపసంహరించుకోవాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ టాక్రే సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం.

 

పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మమ్మూద్ కసౌరి వ్రాసిన “నైదర్ ఏ హాక్ నార్ ఏ డోవ్” అనే పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించాలనుకొనప్పుడు అందుకు శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకపక్క భారత్ పై దాడులు చేస్తూ మరోపక్క దేశం నడిబొడ్డున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతించబోమని విస్పష్టంగా చెప్పింది. ఒకవేళ పుస్తకావిష్కరణకు ప్రయత్నిస్తే తప్పకుండా అడ్డుకొంటామని హెచ్చరించింది. కానీ ఆ కార్యక్రమానికి తమ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భరోసా ఇవ్వడంతో రెండు రోజుల క్రితం ముంబైలో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కానీ చెప్పినట్లుగానే శివసేన కార్యకర్తలు కొందరు పోలీస్ భద్రతావలయాన్ని దాటుకొనివచ్చి ఆ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భారత మాజీ దౌత్యవేత్త సుధీంద్ర కులకర్ణి మొహం మీద నల్ల రంగు పోశారు. అయినప్పటికీ ఆయన వెనుకంజ వేయకుండా మొహానికి ఉన్న ఆ నల్లరంగు కడుగుకోకుండానే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేసారు.

 

శివసేన చేసినపనికి దేశ వ్యాప్తంగా నిరసనలు, తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ వ్యవహారంపై శివసేన-రాష్ట్ర బీజేపీ నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు జరిగాయి. తమ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వం తమ అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకపోగా తిరిగి విమర్శిస్తున్నందుకు నిరసనగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొనేందుకు శివసేన సిద్దం అవుతోంది. ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్నవారి చేత రాజీనామాలు చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ టాక్రే తన పార్టీ ముఖ నేతలతో, మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. వారితో చర్చించిన తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ శివసేన తన మద్దతు ఉపసంహరించుకొంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కూలిపోతుంది.

 

బహుశః బీజేపీ అధిష్టానం శివసేనను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టి ఉండవచ్చును. కానీ అందుకు శివసేన లొంగుతుందా లేదా? అనే సంగతిని పక్కనబెడితే ఈ వ్యవహారంలో అనేక కోణాలు కనబడుతున్నాయి. శివసేన చేసిన ఈ పొరపాటుకి బీజేపీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే కాకుండా బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా మజ్లీస్ వంటి మతతత్వ పార్టీలకు ఇది ఒక గొప్ప ఆయుధంగా అందించినట్లయింది. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, జనతా పరివార్ వంటి కుహానా లౌకికవాద పార్టీలు కూడా దీనిని ఆయుధంగా వాడుకొని బీజేపీపై ప్రయోగించవచ్చును. ఈ వ్యవహారంలో శివసేనదే తప్పయినా అది బీజేపీ ప్రభుత్వాన్ని బలితీసుకోవాలనుకొని బయటపడాలనుకోవడం చాలా దురదృష్టకరం.

 

భారత్ పై దాడులు చేసేందుకు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద నిత్యం కాల్పులు జరుపుతూ భారత జవాన్లను పొట్టన పెట్టుకొంటున్న పాకిస్తాన్ ఈవిధంగా కూడా భారతదేశంలో ప్రభుత్వాలను అస్థిరపరచగలదని నిరూపితం అవుతోంది. కానీ అందుకు పాకిస్తాన్ని నిందించడం కంటే మనల్ని మనమే నిందించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి చిన్న విషయానికి కూడా కూలిపోయేంత బలహీనంగా మన ప్రభుత్వాలు ఉన్నందుకు. బహుశః ఇది పాకిస్తాన్ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన ప్రయత్నం కానప్పటికీ, ఇప్పుడు మన ఈ బలహీనతని పాకిస్తాన్ కూడా బాగా గుర్తించేలా చేయగలిగాము కనుక భవిష్యత్ లో అది ఇటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేయవచ్చును.

 

ఇప్పటికే భారత్ కాశ్మీరులో మనవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందంటూ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ పనిగట్టుకొని ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఈ సంఘటనను కూడా అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ప్రస్తావించక మానదు. భారత్ ఆత్మాభిమానం కోసమే ఈ పని చేసామని శివసేన వాదిస్తోంది. కానీ అది చేసిన ఈ దుందుడుకు పని వలన యావత్ ప్రపంచ దేశాల ముందు భారత్ తలవంచుకొనే పరిస్థితి ఏర్పడింది.