నితీష్ వ్యూహం బెడిసి కొట్టిందా?

 

బీహార్ అసెంబ్లీకి మొదటి దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా ఎన్డీయే, జనతా పరివార్ కూటముల మధ్యే ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమయింది కనుక ఆ రెండు కూటములు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేవలం బీజీపీని ఎదుర్కొనేందుకే లాలూ ప్రసాద్ అవినీతి చరిత్ర, ప్రజలలో ఆయనకున్న చెడ్డపేరు గురించి తెలిసీ కూడా ఆయనతో చేతులు కలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే లాలూతో చేతులు కలిపినందుకే ఆయన తీవ్రంగా నష్టపోయేలాగ ఉన్నారు. మరో విధంగా చెప్పాలంటే వారిద్దరూ బీజేపీని ఓడించేందుకే చేతులు కలిపితే, ఇప్పుడు బీజేపీకి అదే ఊహించని వరంగా మారింది. కనుక ఎన్నికలు ముగిసేలోగా వారు విడిపోకూడదని బీజేపీ ఆ దేవుడిని ప్రార్ధించడం మంచిది.

 

ఒకవేళ నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలపకుండా ఉండి ఉంటే, బీహార్ లో ఆయనని ఎదుర్కోవడానికి బీజేపీ చాలా కష్టపడవలసి వచ్చేది. కానీ నితీష్ కుమార్ లాలూతో చేతులు కలిపి బీజేపీ పని సులువు చేసిపెట్టారని చెప్పక తప్పదు. నితీష్ కుమార్ కి బీహార్ ప్రజలలో ఎంత మంచిపేరున్నపటికీ, ప్రజలు వద్దనుకొంటున్న లాలూని తన ప్రభుత్వంలో భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకొన్నందున, తప్పనిసరిగా ప్రజలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని భావించవచ్చును.

 

లాలూ ప్రసాద్ యాదవ్ నేరుగా నితీష్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం లేనప్పటికీ, ఇదివరకు అయన జైలుకి వెళ్ళవలసి వచ్చినపుడు తన భార్య రబ్రీదేవిని తన ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టి జైల్లో నుంచే బీహార్ రాష్ట్రాన్ని ఏవిధంగా పరిపాలించారో ఇప్పుడు కూడా తన ఎమ్మెల్యేల ద్వారా నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేయడం తధ్యం. ప్రధాని నరేంద్ర మోడీ మోడీ తన ఎన్నికల ప్రచార సభలలో ఇదే పాయింటుని బాగా హైలైట్ చేసి చూపిస్తూ పరిస్థితులని బీజేపీకి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు వెలువడిన సర్వే రిపోర్టులు చూసినట్లయితే ఆయన ప్రయత్నం ఫలించినట్లే కనబడుతోంది.

 

బీహార్ లో ఎన్నికల ప్రచారం మొదలయినప్పటి నుండి లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతున్న మాటలు, వరుసగా చేస్తున్న తప్పుల కారణంగా ఆయన ‘పాపులారిటీ గ్రాఫ్’ చాలా వేగంగా పడిపోతోంది. లాలూ పార్టీ అభ్యర్ధుల మీద ఆ ప్రభావం ఎలాగు ఉంటుంది. కానీ ఆ దుష్ప్రభావం నితీష్ కుమార్ మీద కూడా పడుతోంది. మరి ఈ సమస్యను నితీష్ కుమార్ అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికలలో వామపక్ష కూటమి, ములాయం సింగ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ, బీ.యస్.పీ., ఎం.ఐ.ఎం. తదితర అనేక పార్టీలు స్వతంత్ర అభ్యర్ధులు కూడా బరిలో ఉన్నారు కనుక వారందరి మధ్య ఓట్లు చీలిపోయే అవకాశం కూడా ఉంది. అదే కనుక జరిగితే బీజేపీ నష్టపోవచ్చును. కానీ ఈసారి ఎన్నికలలో బీహార్ ప్రజలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

బీజేపీకి అధికారం కట్టబెడితే బీహార్ లో సుస్థిరమయిన ప్రభుత్వ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని నరేంద్ర మోడి చెపుతున్న మాటలు రాష్ట్ర ప్రజలను బాగా ఆకట్టుకొంటున్నాయి. కనుకనే నేటికీ ప్రజలు నితీష్ కుమార్ నే ఇష్టపడుతునప్పటికీ, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని భావించవలసి ఉంటుంది. నవంబర్ 8వ తేదీన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. కానీ ఈ ఎన్నికలు ఐదు దశలలో సాగుతున్నందున ఈలోగానే బీహార్ లో ఏ కూటమి అధికారంలోకి రాబోతుందనే దానిపై స్పష్టత ఏర్పడవచ్చును.