యూరియా కోసం రైతుల పడిగాపులు
posted on Aug 16, 2025 2:55PM
.webp)
యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని పీఏసీఎస్ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో తెల్లవారు జామునుండే పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలను కేటాయిస్తూ టోకెన్లు ఇస్తుండటంతో గందర గోళం నెలకొంది. యూరియా నిలువలు తక్కువగా ఉండటంతో తమదాకా అందుతాయోలేదోనంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
రాత్రి రెండు గంటల నుండే యూరియా కోసం లైన్ లో నిల్చున్నామని చెబుతున్న మహిళా రైతులు
యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ మానుకొని సరఫరా కేంద్రాల వద్ద రోజంతా క్యూలో పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేట్ డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.
కిలోమీటర్ పొడవునా క్యూ లైన్ లో రైతులు
ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్‌లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. సాగుపనులు వదిలి సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నరు. ఒక్కో బస్తా కోసం ఉదయం నుంచి రాత్రి వరకూ నిద్రాహారాలు మాని నిరీక్షిస్తున్నారు.యూరియా పంపిణి కోసం గూడూరు సీఐ, గూడూరు ఎస్సై, 20 మంది పోలీసులు పహారా కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గూడూరు పిఏసిఎస్ కు చేరుకొనున్నారు. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.ప్రస్తుతం గూడూరు లో హై టెన్షన్ నెలకొంది.