విస్తరిస్తున్న మాఫియా రంగం
posted on Sep 20, 2012 11:42AM
అదేదో విభిన్నమైన రంగం విస్తరిస్తోంది అన్నట్లుగా ‘మాఫియా రంగం’ అనేది మరో రంగం అనుకుంటున్నారా? అదేంకాదు. ప్రతి రంగంలోను అక్రమాలు చోటుచేసుకోవడం, నిలువరించే ప్రయత్నంలో దానికి విరుద్దంగా అందలి మనుషులు మాఫియాలా వ్యవహరించడం జరుగుతోంది. వంగూరు మండలంలోని డిరడి చింతపల్లిలో కుప్పలుగా పోసిన ఇసుక డంప్‌లను సీజ్ చేయడానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారిని హెచ్చరించారు. అలాగే డిరడిచింతపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న మాఫియాను అడ్డగించిన ఓప్రభుత్వ అధికారిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపుతామని హెచ్చరించారట. అధికారులని లేదు, మీడియా అని లేదు, ఎవరైనా వారికి ఒకటే. వారి దందాకు అడ్డు వస్తే కష్టాలు తప్పవు. ఇలాంటి సంఘటనలు ఎన్నో. రాష్ట్రంలో ఇసుకమాఫియా పెరిగిపోతోంది. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నట్లో ప్రజలకు అర్ధంకావడంలేదు. ఇటువంటివారి ఆస్తులను స్వాధీనం చేసుకుని ఖజానాకు జమచేసుకుంటే ప్రజలపై కరెంటు, గ్యాస్ వంటి నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని కొద్దిగానైనా తగ్గించవచ్చు కదా? అన్నది సామాన్యుడి సందేహం. అయినా` ప్రభుత్వ నేతలే అవినీతి, అక్రమ సంపాదనలను పెంచిపోషిస్తున్నారన్న ఆరోపణలతో కేసులతో సతమతమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాందాందార్లను కట్టడిచెయ్యడం రాష్ట్ర సర్కారుకు సాధ్యంకాని పనంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.