ఇప్పటికైతే... ఓ.కె.!

ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా అంతా ఊగిసలాటధోరణే. ఏ క్షణంలో పడిపోతుందో తెలియదు, ఏ క్షణంలో ఎవరు అండగా వుంటామని వచ్చి చేతికి చేయూత ఇస్తారో తెలియదు. సినిమాలో ఒక్కరే అని పాత్రలు వేస్తే ఎలా వుంటుందో అలా అంతా గందరగోళం. ప్రజా సంక్షేమం, ప్రజాసేవ కంటే తమ ప్రభుత్వం నిలబడటానికి ఎంతమంది కావాలో లెక్కాపద్దులు చూసుకోవడంతోనే సరిపోతోంది కేంద్రప్రభుత్వానికి...! ఇదంతా ఎందుకంటే.. స్వయంకృతాపరాధాలే!

 

ప్రజాభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ప్రభుత్వంలో మిత్రపక్షమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. గతంలో రిటైల్‌ మార్కెట్‌లోకి ఎఫ్‌డిఐలను అనుమతించడం వంటి చర్యను ఉపసంహరించుకోవాలని అందుకై ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. అయినా ఎటువంటి స్పందన రాకపోవడంతో తన మద్దతును ఉపసంహరించుకుంది. తృణమూల్‌ మద్దతు ఉపసంహరించుకున్నా తమ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. తృణమూల్‌ మద్దతు ఉపసంహరించుకున్నా మిత్రపక్షాలతో పాటు బయటనుండి మద్దతు ఇచ్చే మరో మూడు పార్టీల సంఖ్యాబలం కలుపుకుంటే సాధారణ మెజారిటీకంటే అధికబలం ఉన్నట్లే అవుతుంది. సంఖ్యాపరంగా బాగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇచ్చి తమ మనుగడను మిగతా పార్టీలు ప్రశ్నార్ధకం చేసుకుంటాయో, లేదా మేము ప్రజాపక్షమని అందుకే ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మద్దతు ఉపసంహరించుకున్నామని ప్రజలకు నిజాలను చెప్పే ప్రయత్నం చేస్తాయో.. వేచి చూడాల్సిందే...! ప్రభుత్వ నేతలు మాత్రం పరిపాలన విషయాలను పక్కనపెట్టి తమ ప్రభుత్వ మనుగడ కోసం చిట్కాలెక్కలతో కాలం గడిపేస్తున్నారన్నది విమర్శకుల విశ్లేషణ...!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu