ఎమ్మెల్సీగా మధుసూదనాచారి.. గవర్నర్ కోటాలో నామినేటెడ్..
posted on Nov 19, 2021 9:43AM
కౌశిక్‌రెడ్డి పోయి మధుసూదనాచారి వచ్చే. నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై నియమించారు. మధుసూదనాచారి పేరును సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గత అసెంబ్లీలో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడినా.. ఏళ్లుగా పార్టీని, తెలంగాణ భవన్‌ను అంటిపెట్టుకున్న మధుసూదనాచారికి మరోసారి అధ్యక్షా అనే అవకాశం కల్పించారు కేసీఆర్. పెద్దాయనను పెద్దల సభకు పంపించారు. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి.
అంతకుముందు గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డి పేరును గవర్నర్‌కు ప్రభుత్వం ప్రతిపాదించింది. హుజురాబాద్ ఎలక్షన్ టైమ్‌లో కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చి.. గులాబీ గూటికి చేరినందున ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చింది. అయితే, కౌశిక్‌రెడ్డిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు రావడంతో.. ఆ ఫైల్‌లు హోల్డ్‌లో పెట్టారు తమిళిసై. దీంతో, కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని చేశారు కేసీఆర్. ఇక గవర్నర్ కోటాలో అంతా ఊహించినట్టుగానే మధుసూదనాచారిని నియమించారు. గవర్నర్ కోటా రేసులో దేశపతి శ్రీనివాస్ పేరు కూడా వినిపించినా.. ఆయనకు ఛాన్స్ దక్కలేదు. కేసీఆర్ గేమ్‌లో దేశపతికి నిరాశ తప్పలేదు.