తగ్గేదే లే.. చట్టాలు రద్దు చేశాకే ఆందోళన విరమిస్తామన్న రైతులు
posted on Nov 19, 2021 9:58AM
మోదీ దిగొచ్చారు. రైతులకు క్షమాపణ కూడా చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. నెలాఖరులో మొదలయ్యే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి, రాజ్యాంగ పరమైన ప్రక్రియ ప్రారంభిస్తాం.. సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి.. తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నా.. అంటూ ప్రధాని విజ్ఞప్తి చేశారు. మోదీ ఇంతగా వేడుకున్నా.. రైతులు మాత్రం వెనక్కి తగ్గేదే లే.. అంటున్నారు.
మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా, రైతులు మాత్రం నిరసన కొనసాగిస్తామంటున్నారు. సింఘు సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులు తిరిగి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని కోరారు. అయితే ఢిల్లీకి సమీపంలోని సింఘు సరిహద్దులో క్యాంప్ చేస్తున్న రైతులు మాత్రం దీనిపై చట్టం చేశాకే తిరిగి ఇళ్లకు వెళతామంటున్నారు. పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే తాము నిరసన స్థలం నుంచి బయలుదేరుతామని రైతులు ముక్తకంఠంతో చెప్పారు.
కేంద్రం గత ఏడాది సెప్టెంబరులో తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు చేశారు. దీంతో దిగివచ్చిన కేంద్రం మూడు వివాదాస్పద చట్టాలను ఎట్టకేలకు రద్దు చేయనుంది. చట్టాలు రద్దయ్యాకే ఆందోళన విరమిస్తామని రైతులు తేల్చి చెప్పారు.