ప్రేమ సంపాదించాలంటే!

చాలారోజుల క్రితం ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్లిద్దరూ మొదట్లో బాగానే ఉండేవారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ అన్నయ్య తీరు మారిపోయింది. మనిషి చాలా కఠినంగా తయారయ్యాడు. లోకం తీరు చూసీ చూసీ అతని మనసే చెదిరిపోయిందో, పరాజయాలు అతని ఆత్మవిశ్వాసాన్నే దెబ్బతీసాయో... కారణం ఏదైతేనేం, అన్నయ్య చాలా ముభావంగా మారిపోయాడు.


అన్నయ్య తీరు చూసి తమ్ముడికి చాలా కష్టంగా తోచింది. ఇదివరకులా అతను తన అన్నయ్యతో మనసు విప్పి మట్లాడలేకపోతున్నాడు, చనువుగా ఉండలేకపోతున్నాడు. అలాగని తనని చిన్నప్పటి నుంచి తండ్రిలా కాచుకుని ఉన్న అన్నయ్యకి దూరంగానూ ఉండలేకపోతున్నాడు. దీనికి పరిష్కారం ఏమిటా అని తమ్ముడు తెగ ఆలోచించాడు. చివరికి తన ఊరి చివర ఉన్న ఒక స్వామీజీ దగ్గరకు వెళ్లాడు.


స్వామీజీతో తన గోడంతా చెప్పుకొన్నాడు తమ్ముడు. ‘స్వామీ! తమరు మందే ఇస్తారో, మంత్రమే వేస్తారో, తాయత్తే కడతారో... ఏదో ఒకటి చేసి మా అన్నదమ్ములు ఇరువురి మధ్యా బంధం బలపడేలా చేయండి స్వామీ!’ అని వేడుకున్నాడు. తమ్ముడి మాటలను సావధానంగా విన్నారు స్వామీజీ. ఆ తర్వాత కాసేపు ఏదో ఆలోచించారు. చివరికి- ‘మీ అన్నయ్య మనసు గెల్చుకునేందుకు ఒక ప్రత్యేకమైన తాయత్తుని రూపొందించాలి. ఆ తాయెత్తుని చేసేందుకు కావల్సిన వస్తువుని తేవడం నీ వల్ల కాదు,’ అన్నారు. 


‘అంతమాట అనకండి. మా అన్నయ్య అభిమానాన్ని తిరిగి పొందడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే!’ అన్నాడు తమ్ముడు.


‘సరే! అయితే నాకు ఆ తాయెత్తులోకి, బతికి ఉన్న పులి మీసాన్ని తీసుకురావాలి. తేగలవా!’ అని అడిగాడు స్వామీజీ.
‘ప్రయత్నించి చూస్తాను!’ అంటూ ఇంటికి బయల్దేరాడు తమ్ముడు. కానీ పులి మీసం అంటే మామూలు విషయమా! ఆలోచించగా ఆలోచించగా అతనికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే కోడి కూర వండుకుని సమీపంలోని అడవికి వెళ్లాడు. అక్కడ ఒక గుహలో ఎప్పటినుంచో పులి నివసిస్తోందని అతను వింటూ వస్తున్నాడు. నిదానంగా ఆ గుహ సమీపానికి వెళ్లి, తాను తెచ్చిన ఆహారాన్ని అక్కడ ఉంచాడు.


తమ్ముడు పొదల్లో దాక్కొని చూస్తుండగా, గుహలోని పులి బయటకు వచ్చి సుష్టుగా ఆ ఆహారాన్ని తినేసి లోపలకి వెళ్లిపోయింది. దాంతో తమ్ముడు మర్నాడు కూడా కోడికూర వండుకుని అక్కడకు చేరుకున్నాడు. ఇలా ఒకో రోజూ గడిచేకొద్దీ పులి అతని ఆహారానికి అలవాటు పడింది. కొన్నాళ్లకి అతని అడుగుల చప్పుడుకే బయటకి వచ్చి కూర్చోవడం మొదలుపెట్టింది. మరికొన్నాళ్లకి కాస్త ముందుగానే బయటకి వచ్చి అతని కోసం ఎదురుచూడసాగింది.


ఇలా ఓ మూడు నెలలు గడిచేసరికి అతనికి పులి దగ్గరకి వెళ్లి దాని ముందర ఆహారాన్ని ఉంచేంత ధైర్యం కలిగింది. నిదానంగా అతను చేయి వేసి నిమిరినా కూడా సహించేంత చనువు ఏర్పడింది. ఇలా మరో మూడు నెలలు గడిచిపోయాయి. ఇక తన పథకాన్ని అమలు చేయాలసిన రోజు వచ్చేసిందనుకున్నాడు తమ్ముడు. ఆ రోజు ఎప్పటిలాగే పులిని నిమురుతూ చటుక్కున దాని మీసాన్ని ఒకటి కత్తిరించేశాడు.


పులి మీసాన్ని సాధించిన గర్వంతో తమ్ముడు పరుగుపరుగున స్వామీజీ దగ్గరకు చేరుకున్నాడు. ‘స్వామీజీ మీరు కోరిన వస్తువుని సాధించాను. మరీ నేను అడిగిన తాయత్తుని వెంటనే ఇస్తారా!’ అని అడిగాడు. స్వామీజీ, తమ్ముడు తీసుకువచ్చిన పులి మీసాన్ని ఎగాదిగా చూశాడు. వెంటనే చటుక్కున దాన్ని అగ్నిగుండంలో పడేసి- ‘ఇక దీని ఉపయోగం లేదులే!’ అనేశాడు.


స్వామీజీ చేష్టలకు తమ్ముడు మ్రాన్పడిపోయాడు. ‘అదేంటి స్వామీ! మీరు అడిగారని నేను ఎంతో శ్రమకి ఓర్చి ఈ పని చేశాను. చివరికి నా ప్రయత్నాన్ని బూడిదచేసిపారేశారే!’ అని బాధగా అడిగాడు.


‘నేను అడిగానని ఒక క్రూర జంతువునే నువ్వు మచ్చిక చేసుకున్నావు. దాని ఇష్టాఇష్టాలను గమనిస్తూ, ఒకో అడుగే ముందుకు వేస్తూ.... దాని మనసు గెలుచుకున్నావు. అలాంటిది ఒక మనిషి మనసుని గెల్చుకోలేవా. నీ అహాన్ని కాస్త పక్కన పెట్టి నేర్పుగా నీ అన్నయ్య మనసుని గెల్చుకోలేవా! మనసుని గెల్చుకునేందుకు కావల్సిన ఓర్పు, పట్టుదల నీకు ఉన్నాయి. నీ అన్నయ్యని గెల్చుకునే మందు నీలోనే ఉంది. ప్రయత్నించి చూడు!’ అని చిరునవ్వుతో బదులిచ్చారు స్వామీజీ!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.