జూన్‌లోనూ లాక్‌డౌన్‌? వ్యాక్సిన్ వ‌ర్రీ! అలాగైతేనే కంట్రోల్‌?

రెండు వారాలుగా తెలంగాణ‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. రోజులో 20 గంట‌ల పాటు స‌క‌లం బంద్‌. సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో లాక్‌డౌన్ నిబంద‌న‌ల‌ను పోలీస్ శాఖ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తోంది. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పై వాహ‌నం క‌నిపిస్తే జ‌ప్తు చేస్తున్నారు. భారీగా ఫైన్లు విధిస్తున్నారు. లాఠీల‌కూ ప‌ని చెబుతున్నారు. ఇంత చేస్తున్నా.. తెలంగాణ‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్యలో పెద్ద‌గా మార్పు రావ‌డం లేదు. నిత్యం 3 వేల‌కు కాస్త అటూ ఇటూగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ లాక్‌డౌన్ కంటిన్యూ కానుంది. ఆ త‌ర్వాత నిబంధ‌న‌లు స‌డ‌లిస్తే ఎలా? ఓవైపు కేసులు పెద్ద‌గా త‌గ్గ‌కున్నా.. లాక్‌డౌన్ ఎత్తేయ‌డం ఏమాత్రం శ్రేయ‌స్క‌రం కాద‌నే ఆలోచ‌న‌లో ఉంది స‌ర్కారు. అందుకే, మ‌రింత కాలం లాక్‌డౌన్ పొడిగించే దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తోంది. 

తెలంగాణలో లాక్‌డౌన్ మరో వారం రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కరోనా కట్టడికి లాక్ డౌన్ పొడిగించక తప్పదని వైద్యశాఖ భావిస్తోంది. ఇప్పటికే వాణిజ్య, ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లు తెలియవచ్చింది. లాక్ డౌన్ కరోనా నియంత్రణపై ఈనెల 28న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యశాఖ అభిప్రాయం మేరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ పొడిగించాలనేది స‌ర్కారు ఆలోచ‌న‌గా తెలుస్తోంది. 

ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. కేంద్రం నుంచి స‌ర‌ఫ‌రా త‌గ్గ‌డం.. ఉన్న వ్యాక్సిన్ల‌నూ ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌కుండా స‌ర్కారు వ్యాక్సినేష‌న్‌ను నిలిపివేయ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు, వ్యాక్సిన్ల సేక‌ర‌ణ‌కు తెలంగాణ ప్రభుత్వం ఇప్ప‌టికే గ్లోబల్ టెండర్లకు ఆహ్వానించింది. దానిపై క్లారిటీ వ‌చ్చేందుకు మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నుంది. 

ఇక‌, జూన్ మొదటి వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద మొత్తంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాక్సినేష‌న్ ఊపందుకున్నాకే తెలంగాణ కాస్త సుర‌క్షితంగా మారుతుంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కూ కేసుల సంఖ్య మ‌ళ్లీ తిర‌గ‌బెట్ట‌కుండా ఉండాలంటే.. జూన్‌లోనూ మ‌రికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తే మంచిద‌నే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. జూన్‌లోనూ కొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu