జగన్ సర్కార్ ను వదిలించుకున్న ఎల్ఐసీ.. ఏపీ విశ్వసనీయత మటాష్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా సాగిస్తున్న అరాచక పాలనకు, అనాలోచిత నిర్ణయాలకు, చేసిన, చేస్తున్న... అప్పులు. తప్పులకు మూల్యం చెల్లించే సమయం ఆసన్నమైందా? అంటే, అవునననే అంటున్నారు, రాజకీయ ఆర్థిక రంగ నిపుణులు. జగన్ ప్రభుత్వం కొత్త అప్పులకు కేంద్ర సర్కార్ బ్రేకులు వేయడం మొదలు, తాజాగా, జీవిత బీమా సంస్థ, (ఎల్ ఐ సీ), అభయ హస్తం పధకంతో తెగతెంపులు చేసుకోవడం వరకు,ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిన ఇతర  పరిణామాలు  రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను భయంకరంగా దెబ్బ తీశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అభయహస్తం పథకం ఈ ప్రభుత్వం తెచ్చిన పథకం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు వృధ్యాప్యంలో అక్కరకొచ్చేందుకు వీలుగా రూపొందించిన పథకం అభయహస్తం పథకం.18–59 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులు రోజుకు ఒక్క రూపాయి చొప్పున ఏడాదికి రూ.365లు చెల్లిస్తే అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అలా క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించిన వారికి 60 ఏళ్లు నిండిన తర్వాత రూ.500 నుంచి రూ.3వేల వరకు ప్రతి నెలా పింఛన్‌ రూపంలో అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం.ఈ ఉద్దేశంతోనే అభయహస్తం పథకం కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థతో 27 అక్టోబరు 2009లో ఎల్ఐసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ ఒప్పందం 3 నవంబరు 2021న రద్దయినట్టు ఎల్ఐసీ తాజా  ప్రకటనలో తెలిపింది. 

అదేమీ తప్పు కాదు. తలదించుకునే వ్యవహారం కాదు, కానీ, ఇకపై అభయహస్తం పథకంతో ఎల్ఐసీకి ఎటువంటి సంబంధం లేదు..  ఇకపై లబ్దిదారుల గత క్లైయిమ్‌లు, పెండింగ్‌లో ఉన్న క్లైయిమ్‌లు, భవిష్యత్తులో క్లైయిమ్‌లన్నింటినీ పరిష్కరించే బాధ్యత గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థదే’ అంటూ బహిరంగ ప్రకటన చేయడం అనేక అనుమానలకు తావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణపై విశ్వాసం లేకనే ఎల్ఐసీ, ఒప్పంద పొడిగింపుకు అవకాశం ఉన్నా, చేతులు కడిగేసుకుని పక్కకు తప్పుకుందని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే, ఎల్ఐసీ, ‘‘అవగాహన ఒప్పందం రద్దుకావడంతో ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న నిధులను అభయహస్తం పథకం నోడల్ ఏజెన్సీ ఎస్ఈఆర్సీకి బదిలీ చేశాం..మాస్టర్ పాలసీ నెంబరు 514888, అభయహస్తం పథకం కింద మా అన్ని కర్తవ్యాలు, బాధ్యతలు నుంచి వైదొలగాం.. ఇకపై అభయహస్తం పథకంతో ఎల్ఐసీకి ఎటువంటి సంబంధం లేదు..” అంటూ బహిరంగ ప్రకటనలో  వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంఫై విశ్వాసం లేకనే ఎల్ఐసీ ఇలాంటి ప్రకటన ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తెచ్చిందని అంటున్నారు. 

ఇదలా ఉంటే, ఎల్ఐసీ ప్రకటనపై స్పందించిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు ఎల్‌ఐసీలో పొదుపు చేసుకున్న రూ.2,200 కోట్లను జగన్ రెడ్డి ప్రభుత్వం స్వాహా చేసిందని ఆరోపించారు. జగన్‌ విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతింటోందనని చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తపరిచారు. నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం  అరాచక పాలన, అస్తవ్యస్థ ఆర్థిక విధానాల వలన, చంద్రబాబు అన్నట్లుగా  ఇప్పటికే రాష్ట్రం బ్రాండ్ ఇమేజి బాగా దెబ్బతింది, చివరకు ప్రభుత్వ రంగ సంస్థలు  కూడా, వామ్మో ఏపీ .. అనే పరిస్థితి వచ్చిందంటే, ఇక ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వాన్ని ఎలా .. విశ్వసిస్తారు... ఎలా పెట్టుబడులు పెడతారని ప్రశ్నిస్తున్నారు.