ఏపీ ‘అభయహస్తా’నికి ఎల్ఐసీ గుడ్ బై!

అప్పుల్లో కూరుకుపోయిన జగన్రెడ్డి సర్కార్ డబ్బుల కోసం సంస్థల్ని, వ్యవస్థల్ని ఎంతగా వేధించి, వెంటాడుతోందో రోజు మీడియాలో కథనాలు కథనాలుగా వస్తున్నాయి. వైసీపీ సర్కార్తో వేగలేక గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఒక్కొక్క సంస్థ రద్దు చేసుకుంటున్నాయి. అభయహస్తం పంథకం అమలు కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ)తో 2009 అక్టోబర్ 27న జీవిత బీమా సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు రద్దు చేసుకుంది. ఈ మేరకు జీవిత బీమా సంస్థ 2021 నవంబర్ 3న ఓ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అవగాహన ఒప్పందం రద్దు నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని కూడా ఆ ప్రకటనలో ఎల్ఐసీ స్పష్టంగా పేర్కొంది.

అవగాహన ఒప్పందం రద్దు చేయడంతో అంతవరకు తమ సంస్థ వద్ద జమ అయిన నిధిని అభయ హస్తం పథకం నోడల్ ఏజెన్సీ ఎస్ఇఆర్పికి బదిలీ చేసినట్లు ప్రకటనలో ఎల్ఐసీ పేర్కొంది. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా జారీచేసిన మాస్టర్ పాలసీ నెంబర్ 514888, అభయహస్తం పథకం కింద తన అన్ని కర్తవ్యాలు, బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు జీవిత బీమా సంస్థ ప్రకటనలో తేటతెల్లం చేసింది. అభయ హస్తం పథకంలో తనకు ఇకపై ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొంది. ఇక నుంచి లబ్ధిదారుల క్లెయిమ్లు, పెండింగ్లో ఉన్న  క్లెయిమ్లు, భవిష్యత్లో వచ్చే క్లెయిమ్లు అన్నింటినీ పరిష్కరించే పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ)దే అని ఎల్ఐసీ సంస్థ తన ప్రకటనలో వివరించింది. ఇక నుంచి అభయ హస్తం పథకం కింద ఉన్న ఎలాంటి క్లెయిమ్లనూ జీవిత బీమా సంస్థ అంగీకరించబోదని స్పష్టంగా ప్రకటనలో వెల్లడించింది.