జమిలీతో జయం.. అసెంబ్లీకి రాంరాం.. జగన్ కొత్త రాగం..!
posted on Feb 24, 2025 3:08PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకపై అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావద్దని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. సోమవారం (ఫిబ్రవరి 24 ) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనర్హత వేటు భయమో, ఉప ఎన్నికలు వస్తే పులివెందుల సహా ఇప్పడు పార్టీకి ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న బెదురో కానీ.. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీ గడప తొక్కను అన్న ప్రతిజ్ణను కాసేపు పక్కన పెట్టి అసెంబ్లీకి హాజరైన జగన్ గవర్నర్ ప్రసంగం పూర్తయ్యే వరకూ కూడా కూర్చో లేకపోయారు. తనతో సహా తన పార్టీ ఎమ్మెల్యేలకు 11వ బ్లాక్ లో సీట్లు కేటాయించడం ఆయనకు ఎన్నికల ఫలితాలను గుర్తు చేసినట్లున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలోనే విజయం సాధించింది. సరే కేటాయించిన 11వ బ్లాక్ సీట్లలోనైనా వైసీపీ ఎమ్మెల్యేలు కూర్చో లేదు. పదే పదే జగన్ ప్రతిజ్ణను గుర్తు చేస్తూ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నానాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అది కూడా ఎక్కువ సేపు లేదు. మళ్లీ మూడు సెషన్ల వరకూ లేదా అరవై సమావేశ దినాల వరకూ తమ సభ్యత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అనుకున్నారో ఏమో.. సరిగ్గా 11 నిముషాల పాటు సభలో నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వచ్చేశారు.
బాయ్ కాట్ తరువాత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ణానోదయమైనట్లు.. తనకు అసెంబ్లీలో జ్ణానోదయమైందన్నట్లుగా మారిపోయారు. ఉప ఎన్నికలు వచ్చినా, ఉన్న స్థానాలు కూడా పోయినా, ఇక అసెంబ్లీకి మాత్రం హాజరయ్యే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి నుంచే మనం తదుపరి ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపు నిచ్చారు. ఎలా చూసుకున్నా 2028లో జమిలి ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పిన జగన్.. అనర్హత వేటు గురించి మరిచిపోయి.. ఆ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేరౌదామని చెప్పుకొచ్చారు. తాను మరో 30 ఏళ్లు రాజకీయాలలో ఉంటాననీ, ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లినా వెళ్లకపోయినా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడతాం. 2028 ఎన్నికలలో గెలుద్దాం అని వారిలో ధైర్యం నింపడానికి ప్రయత్నించారు. చేసిన ప్రతిజ్ణను మరిచిపోయి.. అనర్హత వేటు భయంతో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ కు కేవలం 11 అంటే 11 నిముషాలలో ఈ జ్ణానోదయం ఎలా అయ్యిందబ్బా అని వైసీపీ నేతలే విస్తుపోతున్నారు. ఈ జ్ణానం ఏదో ఒక రోజు ముందు అయ్యి ఉంటే ప్రతిజ్ణను పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లాల్సి వచ్చేది కాదు కదా? పరువు ఇంతగా పోయి ఉండేది కాదు కదా? అని వైసీపీ శ్రేణులే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. నెటిజనులైతే.. మళ్లీ 60 రోజుల గడువు పూర్తి అవుతున్న సమయంలో జగన్ కు పులివెందుల భయం పట్టుకుంటుందేమో చూడాలి అని జోకులేస్తున్నారు.