విద్యార్హతలు బయటపెడదాం రండి.. కొత్త ఉద్యమానికి కేటీఆర్ పిలుపు
posted on Apr 2, 2023 9:18PM
కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు జరిమానా విధించడంపై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. కోర్టుకు వెళ్లిందెవరు, శిక్ష పడిందెవరికి అంటూ పలు వ్యాఖ్యలు వినవస్తున్నాయి. వాస్తవానికి ప్రధాని నరేంద్రమోడీ డిగ్రీ సర్టిఫికెట్ల కాపీల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ను ఆశ్రయించారు. కమిషన్ మోడీ డిడ్రీ సర్టిఫికెట్ల వివరాలు ఇవ్వాలని గుజరాత్ యూనివర్సిటీని ఆదేశించింది. అక్కడ వరకూ బానే ఉంది. కానీ గుజరాత్ యూనివర్సిటీ మాత్రం ఆ సర్టిఫికేట్ల కాపీలు ఇవ్వకుండా సీఐసీ ఆదేశాలను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లింది. కోర్టు మోడీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తీర్పు చెప్పింది.
అక్కడి వరకూ ఓకే.. కానీ కోర్టు అక్కడితో ఊరుకోలేదు. మోడీ విద్యార్హతల వివరాల కోసం ఇన్ఫర్మేషన్ కమిషన్ ను ఆశ్రయించిన కేజ్రీవాల్ కు కోర్టు సమయాన్ని వృధా చేశారంటూ జరిమానా విధించింది. ఈ కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఏ విధంగా చూసిన గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇటువంటి తీర్పు గతంలో ఎన్నడూ రాలేదని అంటున్నారు. గుజరాత్ వర్సిటీ కోర్టును ఆశ్రయించించినది కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా కాదు, మోడీ సర్టిఫికేట్లు ఇవ్వాలన్న సీఐసీ ఆదేశాలకు వ్యతిరేకంగా, దీంతో కోర్టు కేజ్రీవాల్ కు జరిమానా విధించడంపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సంఘటన న్యాయవ్యవస్థలో గతంలో ఎన్నడైనా జరిగిందా అని ఆరా తీస్తున్నారు. న్యాయ కోవిదులను సంప్రదిస్తున్నారు. కేజ్రీవాల్ విలువైన కోర్టు సమయాన్ని ఎక్కడ వృధా చేశారని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఆయన మోడీ డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరడం సమయాన్ని వృధా చేయడమైతే.. ఆయన వృధా చేసింది కోర్టు సమయాన్ని కాదు, సీఐసీ సమయాన్ని కదా, సీఐసీ కేజ్రీవాల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం కింద సెంట్రల్ ఇన్ఫ్మర్మేషన్ కమిషన్ ను కోరారు. కమిషన్ గుజరాత్ యూనివర్సిటీకి ఆదేశాలిచ్చింది. ఇక్కడ నిజంగా కోర్టు సమయం వృధా అయి ఉంటే అది సీఐసీ ఇచ్చిన ఆదేశాల వల్లే.. అటువంటప్పుడు జరిమానా విధించాల్సింది సీఐసీకి కదా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మన విద్యార్హతలను బటయపెడదాం రండి అంటూ ఏకంగా ఒక ఉద్యమానికే పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ విద్యార్హతల విషయంలో గుజరాత్ కోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది.
కేటీఆర్ పిలుపునిచ్చి ఊరుకోలేదు. స్వయంగా తన విద్యార్హతలను బయటపెట్టారు. పుణె వర్సిటీలో బయో టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీని, అమెరికాలోని సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ లో బిజినెట్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశానని వెల్లడించిన ఆయన ఆ సర్టిఫికెట్లను బయటపెట్టడానికి తాను రెడీ అంటూ పేర్కొన్నారు. మోడీ విద్యార్హతలను ప్రశ్నించిన అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు జరిమానా విధించిన వేసిన నేపథ్యంలో కేటీఆర్ ఇచ్చిన పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పిలుపునకు స్పందించిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఇతరులు కూడా తమ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారు.