తిరుపతిలో స్కూటరిస్టుపై చిరుత దాడియత్నం
posted on Jul 26, 2025 9:34AM

తిరుపతి, తిరుమలలో చిరుతల సంచారం బెంబేలెత్తిస్తోంది. తిరుమల నడకదారిలో చిరుతల కలకలం తరచుగా భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో తిరపతిలో కూడా చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.
తాజాగా తిరుపతిలో ఓ స్కూటరిస్టుపై చిరుత దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. తిరుపతి జూపార్క్ రోడ్డులో వెడుతున్న స్కూటరిస్టుపై చిరుత దాడికి ప్రయత్నించింది. స్కూటరిస్టు వేగంగా వెడుతుండటంతో తృటిలో తప్పించుకోగలిగాడు. ఈ దృశ్యాన్ని వెనుక కారులో వస్తున్న వారు వీడియో తీశారు. అది క్షణాల్లో వైరల్ గా మారింది.
ఈ ఘటనతో తిరుపతి వాసులు, భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఇటీవల తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత సంచారాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో వదిలివేయడానికి అటవీశాఖ అధికారులు బోను కూడా ఏర్పాటు చేశారు. అంతలో అదే ప్రాంతంలో చిరుత స్కూటరిస్టుపై దాడికి పాల్పడటంతో జనం భయభ్రాంతులకు గురౌతున్నారు.