జగన్‌పై దాడి..నిందితునికి రెండు, మూడు రోజుల్లో బెయిల్‌

 

విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు తరపున వాదించేందుకు లాయర్ ముందుకొచ్చారు.శ్రీనివాసరావు తరపున వాదిస్తానని, అతనికి బెయిల్ ఇవ్వాలని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తానని సలీం అనే న్యాయవాది పేర్కొన్నారు.రెండు, మూడు రోజుల్లో బెయిల్‌ మంజూరు అవుతుందని ఆశిస్తున్నానన్నారు. శ్రీనివాస్‌ మానసిక స్థితి బాగాలేదని, మొదట్లో శ్రీనివాస్‌ తనను కూడా నమ్మలేదని న్యాయవాది సలీం పేర్కొన్నారు.

మరోవైపు శ్రీనివాసరావును మరోసారి కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేయాలని భావిస్తున్నారు.గత నెల 25న జగన్ పై దాడికి పాల్పడిన తర్వాత శ్రీనివాసరావుని విచారించిన పోలీసులు 26న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున శ్రీనివాసరావుని తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్‌ వేయడంతో ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో శ్రీనివాసరావుతోపాటు ఇతరుల నుంచి సేకరించిన సమాచారంలో కొన్ని అంశాలు విరుద్ధంగా ఉండడంతో స్పష్టత కోసం పోలీసులు శ్రీనివాసరావుని మరోసారి విచారించనున్నారు. ఈ నెల రెండున కోర్టులో కస్టడీ కొరకు పిటిషన్‌ వేయగా కోర్టు దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే.దీంతో మరోసారి కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేయాలని భావిస్తున్నారు.