తిరుమల లడ్డూ వివాదం.. జగన్ హయాంలో దేవాలయాలపై దాడుల కొనసాగింపేనా?
posted on Sep 21, 2024 9:59AM

జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ నాణ్యత నాసిరకంగా ఉండటానికి కారణంపై ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి తెరలేపాయి. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్లుగా ఆయన చేసిన ఆరోపణలు పూర్తి విస్తవాలు అనడానికి నిదర్శనంగా ల్యాబ్ రిపోర్టులను తెలుగదేశం నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి బయటపెట్టారు. దీంతో ఈ అంశం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. చంద్రబాబు లడ్డూ తయారీలో నాణ్యతపై చేసిన వ్యాఖ్యలపై జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పడు జాతీయ స్థాయిలో అత్యంత ప్రధానమైన అంశంగా మారిపోయింది. జగన్ ప్రభుత్వ హయాంలో అరచకాలకు అంతే లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు దశాబ్దాలకు పైగా కర్నాటక మిల్క్ ఫెడరేషన్ సరఫరా చేస్తున్న నాణ్యమైన నెయ్యిని పక్కన పెట్టి వేరే వ్యక్తులకు కాంట్రాక్టు ఇవ్వడం.. నెయ్యి నాణ్యతను పట్టించుకోవడం మానేయడం వల్లనే లడ్డూ క్వాలిటీ దెబ్బతిందంటూ జాతీయ చానెళ్ల పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. టీవీల్లో చర్చలు పెట్టడంతో ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
సాయంత్రం నుంచే జాతీయ స్థాయిలో తిరుమల లడ్డు టాపిక్ ట్రెండ్ అయింది. ఒక దశలో ఇండియాలో నంబర్ వన్ టాపిక్‌గా మారింది. దీంతో పాటుగా జగన్ పేరు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచం నలుమూలల నుంచీ శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమల దేవుడి ప్రసాదం అయిన లడ్డూను పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు జరిగిందని వెల్లడి కావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వైసీపీపై మరీ ముఖ్యంగా జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ, కేంద్రం కూడా ఈ విషయాన్ని యమా సీరియస్ గా తీసుకున్నాయి. హోంమంత్రి అమిత్ షా చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారంపై, నెయ్యి కల్తీపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ తరఫున ఇటీవలి సార్వత్రిక ఎన్నకలలో హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన మాధవీలత ఏకంగా తిరుమలలో అత్యాచారం జరిగింది. ఇక హైందవ యుద్ధం మొదలౌతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఒక తిరుమల లడ్డూ ప్రసాదమేనా లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక దేవాలయాలలో ప్రసాదం విషయంలో కూడా ఇటువంటి అపచారాలు జరిగాయా అన్న అనుమానాలు భక్తుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. తిరపతి అలివేలు మంగాపురంలోని అమ్మవారి ఆలయం, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం, చిన్న తిరుమతి, అన్నవరం సత్యనారాయణ స్వావి వారి దేవాలయం, సింహాచలం అప్పన్న ఆలయం.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధీనంలోని దేవాలయాలలో కూడా ప్రసాదాల తయారీలో ఇటువంటి అపచారం జరిగి ఉంటుందా అన్న భక్తుల అనుమాలను నివృత్తి చేయడానికి అన్ని ఆలయాలలో ప్రసాదాల నాణ్యతపై పరీక్షలు జరపాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. కలియుగ దైవంగా హిందువులు విశ్వసించే తిరమల దేవుడి ప్రసాదం తయారీలోని జగన్ హయంలో ఇంతటి అపచారం జరిగిందంటే... రాష్ట్రంలోని ఇతర దేవాలయాలలో అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదని పలువురు అంటున్నారు. ఈ సందర్భంగా అన్నవరం దేవాలయంలో ప్రసాదం నాణ్యతపై గతంలో ఇటువంటి ఆరోపణలు వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. . కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమలతో సహా రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాలలో ప్రసాదాల తయారీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ హయాంలో దేవాలయాలపై దాడులు, దేవుడి విగ్రహాల ధ్వంసం జరిగిన సంగతిని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న అన్ని ఆలయాలలో ప్రసాదం తయారీపై సమగ్ర విచారణ జరిపిస్తేనే జగన్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వెలుగులోనికి వస్తాయని అంటున్నారు.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో రాష్ట్రంలో దేవుడికే రక్షణ లేని పరిస్థితి ఉంది. జగన్ అధికారంలో ఉండగా అంతర్వేది నరసింహ స్వామి రథం దగ్దం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి రథానికి ఉండే సింహాలు మాయం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం, కర్నూల్ జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం.. వంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో అప్పట్లోనే జగన్ సర్కార్ హిందూ దేవాలయాలపై దాడులకు ప్రోత్సహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం బయటకు రావడంతో జనం జగన్ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను గుర్తు చేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులన్నీఎత్తి చూపుతూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.