కాంగ్రెస్, వైకాపాలకు కేవీపీ ఎఫెక్ట్

 

సరిగ్గా రెండు వారాల క్రితం అమెరికా దర్యాప్తు సంస్థ రాజ్యసభ సభ్యుడు కే.వీ.పీ. రామచంద్రరావుపై టైటానియం కుంభకోణంలో మోపిన అభియోగాలను చికాగో కోర్టు దృవీకరించినప్పుడు, రాష్ట్ర రాజకీయ వర్గాలలో కలకలం చెలరేగింది. అయితే షరా మామూలుగానే అప్పుడు కేవీపీ తనపై అటువంటి నిరాధారమయిన ఆరోపణలు రావడం దురదృష్టకరమని, చికాగో కోర్టు, సదరు దర్యాప్తు సంస్థ వెంటనే తమ నివేదికలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఆ నివేదిక చూసిన తరువాతనే తాను స్పందిస్తానని అప్పటికి తప్పుకోగలిగారు.

 

అయితే కధ అక్కడితో ముగిసిపోలేదు. ఆ తరువాత కొద్ది రోజులకే, అమెరికా సంస్థ కేవీపీ అరెస్టు కోరుతూ, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఆయనను తమకు అప్పగించమని భారత ప్రభుత్వానికి కూడా కోరింది. ఇదంతా జరిగి అప్పుడే పది రోజులయింది. కానీ ఆ సంగతి ఈరోజే బయట పడింది. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయిన కేవీపీ ఈరోజే ప్రమాణ స్వీకారం చేసారు. బహుశః అందుకొరకే ఇంతకాలం ఈ విషయాన్ని ప్రభుత్వం త్రొక్కిపెట్టి ఉండి ఉండవచ్చును. తమకు పది రోజుల క్రితం అందిన రెడ్ కార్నర్ నోటీసును సీబీఐ, ఈరోజు రాష్ట్ర సీఐడీ పోలీసు శాఖకు పంపినట్లు సమాచారం.

 

భారత పార్లమెంటు సభ్యుడయిన ఆయనను అమెరికా దర్యాప్తు సంస్థ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ద్వారా అరెస్టు చేయడం సాధ్యమా కాదా? అనేది న్యాయ నిపుణులు తేల్చవలసిన విషయం గనుక అది అప్రస్తుతం. ఈ నోటీసు వలన ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా? ఆయన తనకున్న అపారమయిన రాజకీయ పలుకుబడి, పరపతిని వినియోగించి అరెస్టు నుండి తప్పించుకొంటారా? లేక ఆయన కూడా తెలివిగా కోర్టును ఆశ్రయించి తప్పుకుంటారా? అనేవి కూడా అప్రస్తుత విషయాలే.

 

కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు బయటపడిన ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉన్న కాంగ్రెస్, వైకాపాలపై అది ఏవిధంగా ప్రభావం చూపబోతోంది? దాని నుండి ఆ రెండు పార్టీలు ఏవిధంగా తప్పుకొనే ప్రయత్నాలు చేస్తాయి? వంటివే ప్రధానంగా చర్చకు రానున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu