ఈటల ఓటమికి కేటీఆర్ వ్యూహం!?

తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పిన నియోజక వర్గం  హుజురాబాద్.  ఇంచుమించుగా ఏడాది కిందట జరిగిన  హుజురాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ఎంతగా ప్రభావితం చ్జేసిందో, అందుకు కారణాలు ఏమిటో వేరే చెప్పనక్కరలేదు.  తెరాస ఆవిర్భావం నుంచి కేసీఆర్ అడుగులో అడుగేస్తూ వచ్చిన బీసీ నేత ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో మొదలై హుజురాబాద్  ఉపఎన్నిక వరకు కొనసాగిన పొలిటికల్ హైడ్రామా గురించి ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవడం చర్విత చరణమే అవుతుంది.

ఆ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాడినా  ఓడిపోయిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్  బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించారు.  ఇక అక్కడ నుంచి బీజేపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా కొత్త వ్యూహాలకు పదునుపెడుతూ వచ్చారు. ఈటల చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకనో ఏమో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలను వెంటాడుతూనే ఉన్నారు. ఈటల ఎమ్మెల్యేగా ఎన్నికై సంవత్సరం అయినా ఇంతవరకు అసెంబ్లీలో ఆయనను కనీసం ఒక్క రోజైనా కూర్చోనీయలేదు. మాట్లాడనీయలేదు.   ఏదో ఒక సాకుతో ఆయన్ని సభ నుంచి సస్పెండ్ చేస్తూనే ఉన్నారు.

శుక్రవారం (ఫిబ్రవరి 3) నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అయినా ఈటలను  గౌరవ స్పీకర్  సభలో ఉండనిస్తారో లేదో చూడాలి.అదలా ఉంటే, వచ్చే ఎన్నికలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీద పోటీ చేసి గెలుస్తానని సవాల్ చేస్తున్న ఈటలను సొంత  నియోజక వర్గం హుజురాబాద్ లో ఓడించేందుకు,  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్,  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్  అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు వచ్చే ఎనిమిది నెలలు ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆయనకు సూచించారు.

గత ఉప ఎన్నికలలో బీసీ కార్డు బాగా పని చేస్తుందని గెల్లు శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చి ప్రయోగం చేశారు. కానీ అది ఏమాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డికి ఈటల రాజేందర్ ను ఓడించే అవకాశం ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం హోరాహోరి పోరాటం జరుగుతుంది. ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ కు, నియోజకవర్గ ఇన్చార్జిగా అవకాశం దక్కింది. తనకే టికెట్ వస్తుంది అనుకుంటున్న వేళ కేటీఆర్ ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు.

అయితే  ఇప్పటికే  కౌశిక్ రెడ్డి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఇటీవల గవర్నర్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను కోర్టు సైతం తప్పు పట్టింది.  ఆ తప్పును ప్రభుత్వ తరపు న్యాయవాది అంగీకరించడంతో పాటుగా, మరో మారు అలాంటి పరిస్థితి రాదని కోర్టుకు తెలిపారు. అయితే   కౌశిక్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారు. అదలా ఉంచితే  ఏ విధంగా చూసినా   కౌశిక్ రెడ్డి ఈటలకు సామ ఉజ్జీ కాదని అంటున్నారు. అంరో వంక ఉప ఎన్నికల్లో పోటీచేసిన గెల్లు శ్రీనివాస్ వర్గం కౌశిక్ రెడ్డిని ఉద్యమ ద్రోహిగా పేర్కొంటూ  ఇప్పటికే ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ ని ఢీకొట్టడం   కౌశిక్ రెడ్డికి అయ్యే పనేనా?  అంటే, కాదనే అంటున్నారు.