కేటీఆర్..దిగ్విజయ్ ట్వీట్ వార్... కేసులు పెట్టినా పర్వాలేదు..

 

కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్ తెలంగాణ పోలీసులపై ట్విట్టర్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్‌ వెబ్‌సైట్‌ తయారుచేసి యువతను రెచ్చగొడుతున్నారు. యువతను రెచ్చగొట్టాలని పోలీసులకు సీఎం కేసీఆర్‌ అధికారం ఇచ్చారా?. అలా అయితే ఆయ‌న‌‌ దానికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలి. లేకపోతే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని దిగ్విజయ్‌ సింగ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. దీనికి గాను కేటీఆర్ స్పందించి డిగ్గీ వ్యాఖ్యలపై తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేశారు.  ‘ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం తగదు. దిగ్విజయ్‌ సింగ్‌ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని.. క్షమాపణలు చెప్పాలని అన్నారు. దీంతో దిగ్విజయ్ సింగ్ క్షమాపణలు చెబుతారా..? లేదా..? అని అందరూ ఎదురుచూస్తుండగా.. ఆయన మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

 

ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ పోలీసులపై నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా.. నాపై కేసులు పెట్టినా పర్వాలేదు.. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని అన్నారు. ఢిల్లీలో కౌంటర్ టెర్రరిజం సమావేశంలోనే పలువురు అధికారులు తెలంగాణ పోలీసులు తీరును వ్యతిరేకించారు..ఐసిస్ వైపు ఆకర్షితులయ్యే యువతను గుర్తించేందుకు.. తెలంగాణ పోలీసులు అనుసరించిన మార్గం సరైంది కాదు..మధ్య ప్రదేశ్ రైలు ఘటన,  కాన్పూర్ ఎన్ కౌంటర్ సమాచారాన్ని తెలంగాణ పోలీసులే అందించారు అని అన్నారు. మరి దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu