పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి : కేటీఆర్
posted on Aug 5, 2025 6:46PM

దేశంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కారు గుర్తును పోలిన సింబల్స్ దాదాపు 9 వరకు ఉన్నాయి. ఉదాహరణకు 2019 ఎన్నికల్లో భువనగిరిలో 5 వేల ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలిచారు. తమ పార్టీ తరపున పోటీ చేసిన బూర నర్సయ్య ఓడిపోయారు. కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌కు 27 వేల ఓట్లు వచ్చాయి.
ఇలా ఎన్నో సందర్భాల్లో మా పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో 14 స్థానాల్లో 6 వేల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. కారు గుర్తును పోలిన గుర్తుల వల్లే నష్టం జరిగింది. ఆ గుర్తులను కేటాయించవద్దని ఈసీకి కేటీఆర్ విన్నవించారు. అమెరికా లాంటి దేశాలు కానీ, యూకే, జర్మనీ, ఇటలీ కానీ, ఇంకా చాలా దేశాలు కొంతకాలం వరకు ఈవీఎంలను ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పటికీ, ప్రజల్లో వాటిపై విశ్వాసం లేకుండా పోయింది.
ఈ క్రమంలో ఈవీఎంలను రద్దు చేసి పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి దేశంలో ఈవీఎంల వల్ల నష్టం జరుగుతున్నదని కేటీఆర్ తెలిపారు. పార్టీలు ఎన్నికల వాగ్థనాలు విస్మరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కేటీఆర్ కోరారు.