నేను బ‌త‌కాలి త‌మ్మీ..అంటూ చ‌నిపోయావేంటి కోట‌?

 

 

గ‌ణేశ్ సినిమాలో.. ఫేమ‌స్ డైలాగ్. నేను బ‌త‌కాలి త‌మ్మీ అంటూ ఆయ‌న చెప్పిన డైలాగుల‌కు అప్పట్లో య‌మ క్రేజుండేది. ఆపై గాయంలో ఆయ‌న ఖండిస్తున్న అనే డైలాగ్ కూడా చాలా చాలా ఫేమ‌స్ అయ్యింది. ఇక ఆమె సినిమాలో కోట న‌ట విశ్వ‌రూపం మామూలుది కాదు.ఇలా చెప్పుకుంటూ పోతే సీరియ‌స్ కామెడీ తేడా లేకుండా ఆయా పాత్ర‌ల‌ను అవ‌లీల‌లగా పోషించిన కొంద‌రంటే కొంద‌రు న‌టుల‌లో కోట న‌టన‌కు పెట్టిన‌ కోటే.. నిజంగా. సాధార‌ణంగా సినిమా రూట్ మ్యాప్ ఎలా ఉండేదంటే.. ఏదైనా ఎల్ఐసీ, జ‌ర్న‌లిజం, టీచింగ్, బ్యాంకు వంటి  రంగాల్లో జాబ్ చేస్తూ.. ఆపై నాట‌కాలు ఆడుతూ.. అటు నుంచి సినిమాల్లో అవ‌కాశాలు అంది పుచ్చుకుంటూ ఫైన‌ల్ గా ఇక్క‌డ సెటిల‌వ‌డం. 

ఈ విష‌యంలో ఇప్ప‌టికీ చాలా మంది క‌ప్ప‌దాట్లు దాటుతూ ఉంటారు. వారికంటూ అంత తేలిగ్గా ఫీల్డ్ లో బిజీ కావ‌డం సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. కానీ కోట అలాక్కాదు. బ్యాంకు జాబు అదీ ఇదీ మొత్తం క‌ట్ట‌క‌ట్టి.. అట‌క మీద ప‌డేసి.. ఎంచ‌క్కా సినిమా ఫీల్డ్ లో సెటిలై పోయారాయ‌న‌.ఒక స‌మ‌యంలో ఆయ‌న బాబూ మోహ‌న్ తో చేసిన మామ‌గారు త‌ర‌హా కామెడీకి అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండేది. ఆ త‌ర్వాత ఆయ‌న సీరియ‌స్ యాక్టింగ్ స్కిల్స్ కి సౌత్ లో చాలా సినిమాల్లో యాక్టింగ్ ఛాన్సులు వ‌చ్చాయి. 

ప్ర‌కాష్ రాజ్ లా ఆయ‌న జాతీయ ఉత్త‌మ న‌టుడు సాధించ‌లేక పోయాడు క‌నీ.. ఇంచు మించు అలాంటి వ‌ర్స‌టైల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్న న‌టుడు కోటా శ్రీనివాస‌రావు.ఎక్క‌డో బ్యాంకుల్లో ఉద్యోగం చేసుకుంటూ నాట‌కాలాడి.. ఆ నాట‌కాల ప్ర‌స్తానం కొద్దీ సినిమాల్లోకి అడుగు పెట్టి.. అంచెలంచెలుగా న‌టుడిగా ఎన్నో ఎత్తుల‌కు ఎదిగి  ఒక స‌మ‌యంలో.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచి.. రాజ‌కీయంగానూ త‌న ప్ర‌స్తానం కొన‌సాగించి.. చివ‌రికిదిగో ఇలా త‌న జీవితానికే టాటా చెప్పి వెళ్లిపోయారు కోట‌.

ఆయ‌న త‌న న‌ట జీవితంలో అన్ని కోరిక‌లూ తీర్చుకుని వెళ్లారు.  కానీ.. త‌న కొడుకు అర్ధాంత‌ర మ‌ర‌ణంతో తీవ్ర నిరాశా నిస్పృహ‌ల‌కు లోన‌య్యారు. ఇటు త‌న‌తో పాటు ఎన్నో చిత్రాల్లో క‌ల‌సి న‌టించిన బాబూ మోహ‌న్ కి, త‌న‌కి ఇద్ద‌రీ ఒక‌టే త‌ర‌హా పుత్ర శోకం క‌ల‌డం అత్యంత విషాద క‌రం.ఏది ఏమైనా కోట మృతి టాలీవుడ్ కి తీర‌ని లోటు. కార‌ణ‌మేంటంటే.. ఆయ‌న‌లాంటి పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి ఆయ‌నే మ‌రోమారు న‌ట‌కోటావ‌తారం ఎత్తాల్సిందే.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu