కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్
posted on Jun 9, 2025 11:18AM

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం (జూన్ 9) ఉదయం అరెస్టు చేశారు. ఒక చానెల్ లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆయనను తుళ్లూరు తరలిస్తున్నారు. ఒక చానెల్ లో కొన్ని రోజుల కిందట కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమం ప్రసారమైంది.
ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణం రాజు అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఇలా ఉండగా తెలుగుమహిళలు కొమ్మినేని, కృష్ణం రాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు సోమవారం (జూన్ 9)అరెస్టు చేశారు. ఆయనను విజయవాడ తరలిస్తున్నారు.