కోహ్లీయా మజాకా..పాక్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం
posted on Oct 23, 2022 6:27PM
టీ-20 ప్రపంచకప్ సూపర్12 విభాగంలో శనివారం భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ నిజంగా గోళ్లు, వేళ్లూ కొరుకేసుకు న్నంత ఉత్కంఠభరితంగానే జరిగింది, చివరంటా! ఒకరికి ఇంకెంత మూడు ఓవర్లో గెలిచేస్తామనే సంబరం, మూడు ఓవర్లలో ఇక కష్టం అని దాదాపు చేతులు ఎత్తేసి ఇవతలివారు..కానీ మొత్తం సీన్ మారిపోయింది. వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. ఇది ఎన్నడూహించని రికార్డుస్థాయి పరిణామం. స్టేడియాలో 90వేలమంది, లోకమంతా కలిపి కోట్లాది మంది, ఇరుజట్ల వీరాభిమా నులు, అధికారులు, కోచ్‌లూ అంతా ఏమాత్రం స్థిమితంగా లేరు.. అందరికీ ఖంగారెత్తిపోతోంది..మనోళ్లు గెలవగలరా అని ఏడుపు మొహాలే.. కానీ ఇంతమందిలో ఒక్కడే నేనున్నానుగా అంటూ నిలిచాడు.. అందరూ అతన్ని కింగ్ అంటారు.. అసలు పేరు విరాట్ కోహ్లీ! పూర్తిస్తాయి ఒత్తిడిలో ఊహించని విధంగా మెరుపులు మెరిపించి జట్టు విజయాన్ని పాక్ చేతుల్లోంచి లాగేసేడు. రిజ్వాన్, అప్రిదీ, బాబర్ అజామ్ కొయ్యబొమ్మల్లా అలా విస్తుపోయారంతే! ఇది ఊహిం చని విజయం. పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టా నికి 159 పరుగులు చేసింది. భారత్ 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
ముందుగా బ్యాటింగ్‌కి దిగిన పాకిస్తాన్ మొదటి మూడు ఓవర్లలో పరుగులు చేయడానికి నానా అవస్తాపడింది. బంతి బాగా స్వింగ్ అవుతుండడం భువనేశ్వర్ ప్రతాపం ముందు నిలబడ్డానికి ఇబ్బందిపడ్డారు ఓపెనర్లు. యువ పేసర్ తొలి టీ20 వరల్డ్‌కప్ ఆడు తున్న అర్షద్ సింగ్ పాక్ పాలిటి దుస్వప్నంగా మారాడు. మొదటి ఓవర్లో మొదటి బంతికే వికెట్ తీశాడు. కెప్టెన్ బాబర్ అజామ్‌ను పెవిలియన్‌దారి పట్టించడంతో కెప్టెన్ శర్మకు నమ్మకం కలిగించాడు. 4వ ఓవర్లోనే రిజ్వాన్ మళ్లీ అతనికే దొరికాడు. మొదటి 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 24 పరుగులే చేసింది. పదో ఓవర్లో పాండ్యా ముచ్చటగా పది పరుగులు ఇవ్వడంతో పది ఓవర్లు అయ్యేసరికి 60 పరుగులు చేశారు. ఇఫ్తెకార్ రెచ్చిపోయి ఆడాడు. దాంతో పాక్ స్కోర్ పరుగులెత్తింది. కానీ మరో వంక వికెట్లు పడుతూండడంతో కాస్తంత ఖంగారుపడ్డారు. అలా 15 ఓవర్లలో పాక్ 5 వికెట్లు కోల్పోయి 106 పరుగులుచేసింది. 20 ఓవర్లలో పాకిస్తాన్ చాలా అవస్తపడినా 159 పరుగులు చేయగలిగింది. ఒక సమయంలో 120 కొడితే గొప్ప అన్నట్టుగా ఆడారు. పాక్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ ఎంతో దూకుడుగా ఆడి 48 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. పాండ్యా, సింగ్ చెరి 3 వికెట్లూ తీసుకున్నారు.
160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన భారత్ మొదటి 5 ఓవర్లలో కేవలం 22 పరుగులు చేసి శర్మ, రాహుల్ వికెట్లు కోల్పో యింది. తర్వాత వచ్చిన కింగ్ కోహ్లీ ఎంతో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టడానికి పూనుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ ఊహించని విధంగా 11 పరుగులకే వెనుదిరగడం కింగ్‌ను ఇబ్బందుల్లో పడేసిందనాలి. ప్రధాన బ్యాటర్లు, ఫామ్‌లో ఉన్నవారు వెనుదిరగడంతో పాక్ విజయం దాదాపు ఖాయమయిందన్న ఆనందం వారిలో కనపడింది. కావడానికి 160 పెద్ద స్కోర్ కాకపోవచ్చు. కానీ వారి ఫీల్డింగ్ బౌలింగ్ దాడి అద్భుతంగా సాగింది. దాంతో భారత్ వేగంగా పరుగులు సాధించడం దుర్లభమయింది. కోహ్లీ మాత్రం జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు. సూర్య తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే తరుణంలో వీర బాదుడికి దిగారు. ఇద్దరు మంచి వేగంగా పరుగులు తీయగలరు గనుక స్కోర్ కాస్తంత పరుగులే పెట్టింది. 15 ఓవర్లకు భారత్ 4 వికెట్లు కోల్పోయి 100 పరుగులే చేసింది. పాక్‌తో పోలిస్తే 6 పరుగులు వెనకే ఉన్నాం. భారత్ మొదటి 50 పరుగులకు 63 బంతులు పట్టింది. ఆట 17వ ఓవర్ నుంచి టెన్షన్ మొదలయింది. గెలవడం దుర్లభమే అన్న అభిప్రాయానికి జనం వచ్చేశారు. భారత్ అభిమానులు దిగాలుపడ్డారు. 18 ఓవర్లో ఒక ఫోర్ కొట్టి కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆఫ్రిదీ ఆ ఓవర్లో ఏకంగా 18 పరుగులిచ్చాడు. అంతకుముందు రవూఫ్, నసీమ్‌లు కూడా పరుగులిచ్చుకోవడంతో భారత్ కాస్తంత ఊపిరిపీల్చుకుంది. కానీ చివరి రెండు ఓవర్లలో చాలా పరుగులే కావాల్సి వచ్చాయి. కోహ్లీ, పాండ్యాలు 75 బంతుల్లో వంద పరుగుల చేశారు. చివరి ఓవర్లలో వారు విజృంభించడంతో పాక్‌కు గెలిచే అవకాశాలు చేజారుతున్నాయన్న భయం పట్టుకుంది. అంతా ఖంగారుపడ్డారు. ఫీల్డింగ్ పాడుచేసుకున్నారు, బౌలర్లు ఇబ్బందిపడ్డారు. మరీ ముఖ్యంగా రవూఫ్ వేసిన ఓవర్లో కోహ్లీ బాదేశాడు. రవూఫ్ 15 పరుగులిచ్చి పాక్ ఆశలు గల్లంతు చేశాడు. 20వ ఓవర్లో 16 పరుగులు కావాల్సి వచ్చింది. భారత్ ఓటమి ఖాయమను కున్నారు. దాదాపు ఆశలు వదిలేశారు. కానీ ఇక్కడే పాక్ తప్పులో కాలేశారు. చివరి ఓవర్ నవాజ్ చేశాడు. ఆ ఓవర్లో పాండ్యా వెనుదిరిగాడు. అతను 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అప్పుడు ఫినిషర్ కార్తీక్ వచ్చాడు. కానీ మరో వంక కోహ్లీ వీర విహారం చేశాడు. తర్వాత 2,6,1,3, కార్తీక్ వెనుదిరిగాడు. అశ్విన్ రాగానే 2 బంతుల్లో 3 చేయాల్సి వచ్చింది. అశ్విన్ రాగానే నవాజ్ వేసిన బంతి వైడ్ కావడంతో 2 బంతుల్లో 2 పరుగులు కావాల్సి వచ్చింది. తర్వాత ఒక పరుగు ఒకబంతి మిగిలాయి. అశ్విన్ బ్యాటింగ్ చేయడం తెలుసు గనుక చాలా తెలివిగా, ఫీల్డర్లంతా ముందు ఉండగా చివరి బంతిని పైకి కొట్టే శాడు, అది ఫోర్ పోయింది. దాంతో భారత్ విజయానందానికి అంతేలేదు. పాక్ 11 ఎక్‌స్ట్రాలిచ్చారు. కోహ్లి 82 పరుగులతో అజే యంగా నిలిచాడు. మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కెప్టెన్ ఆనందానికి అంతే లేదు..మరో వంక కోహ్లీ ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.. ఇంత చిట్టచివర విజయం సాధించడంలో పడ్డ కష్టానికి! బట్ కింగ్ ఆల్వేస్ కింగ్!