అజ్ఞాతంలోకి మాజీ స్పీకర్ కోడెల కుటుంబం!!

 

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు, కుమార్తె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 'కే-టాక్స్' పేరిట నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో కోడెల కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి చేసిన దందాలపై పోలీసు కేసులు నమోదైన వేళ, వారు నగరం నుంచి అదృశ్యమయ్యారు.

వీరిపై ఇప్పటివరకూ మొత్తం ఐదు కేసులు నమోదుకాగా.. వాటిల్లో రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి. భూ కబ్జా, నకిలీ పత్రాల తయారీ, బెదిరింపులు వంటి ఆరోపణలు రావడంతో, వీరిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టిన పోలీసులు విచారణ చేపట్టారు. వారిపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని భావించిన పోలీసులు.. నోటీసులు ఇచ్చి విచారించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో.. విషయం తెలిసి శివరామ్, విజయలక్ష్మిలు నరసరావుపేటను వీడినట్టు సమాచారం.

వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేనట్లు తెలుస్తోంది. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు చెబుతున్నారు. ముందస్తు బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వారికోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.