రేవంత్‌ను ఓడించేందుకు రూ.వందకోట్ల ఒప్పందం

 

కొడంగల్ నియోజకవర్గం..కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కంచుకోట.ఎలాగైనా రేవంత్ రెడ్డి కోట బద్దలు కొట్టి తెరాస జెండా పాతాలని కేసీఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు.ఇప్పటికే తెరాస కొడంగల్ టికెట్ ని మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి కి కేటాయించింది.నరేందర్ రెడ్డి కూడా రేవంత్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా మీడియా తో మాట్లాడిన నరేందర్ రెడ్డి దమ్ము, ధైర్యముంటే రేవంత్‌రెడ్డి తనపై గెలవాలని సవాల్‌ విసిరారు.మాటలతో మభ్యపెట్టి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డిని ఈసారి ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.తెరాస ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని నరేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ దీపావళి నాటికి మిషన్‌ భగీరథ ఫలాలు అన్ని గ్రామాలకు అందుతాయని.. రాబోయే రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ద్వారా కొడంగల్‌ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని నరేందర్‌రెడ్డి వివరించారు.కొడంగల్‌లో మిషన్‌ భగీరథ ఆలస్యానికి రేవంత్‌రెడ్డి తీరే కారణమని విమర్శించారు. నియోజకవర్గంలో నాపరాయి పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.రేవంత్‌ను ఓడించేందుకు రూ.వందకోట్ల ఒప్పందం కుదిరిందంటూ చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమని ఆయన అన్నారు.