కొడాలి నాని మౌనం.. భయమా? జ్ణానోదయమా?

అధికారంలో ఉన్నంత కాలం తప్పొప్పులు, మంచిచెడులు అన్న తేడా లేకుండా ఇష్టారీతిగా బూతులుతో రెచ్చిపోయిన మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని, వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాట్లాడడమే మరిచిపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేంత నిశబ్దాన్ని..  అదేనండీ మౌనాన్ని పాటిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ.. ఆ అధికారం అండ చూసుకుని తెలుగుదేశం అధినాయకత్వంపైనా, జనసేనానిపైనా నోటికి అడ్డూ అదుపూ లేదన్న రీతిలో రెచ్చిపోయిన కొడాలి నాని.. రాష్ట్రంలో వైసీపీ ఓటమి, గుడివాడలో తన ఓటమి తరువాత దాదాపు అడ్రస్ లేకుండా పోయారు.

ఓటమి తరువాత ఇంచుమించు ఏడాది పాటు తనను వరుసగా ఐదు సార్లు గెలిపించిన గుడివాడ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టలేదు. అధికారంలో ఉన్న సమయంలో  విపక్ష పార్టీల నాయకులపై బూతుల వర్షం కురిపించడం తన హక్కు అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని.. ఆ అధికారం దూరమయ్యేసరికి నోరెత్తితే ఓట్టు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నానిలో ఈ మార్పు జ్ణానోదయమా? అని కొందరు ఒకింత అనుమానపడ్డారు కూడా.. కానీ అది జ్ణానోదయం కాదనీ, జాగ్రత్త మాత్రమేననీ కొడాలి నానే ఒక సందర్భంగా మీడియా ముందు వెల్లడించారు. తాను మౌనంగా ఉండటానికి కారణం అధకారం లేకపోవడమే తప్ప.. మరోటి కాదని కుండబద్దలు కొట్టారు. ఒక సందర్భంలో మీడియాతో ముక్తసరిగా మాట్లాడిన నాని జనం తమ అధికారాన్ని పీకేశారనీ, అంటే ఉద్యోగం నుంచి తొలగించారనీ అందుకే మౌనంగా ఉన్నాననీ చెప్పారు. అది కూడా గత ఫిబ్రవరిలో అప్పటికి రిమాండ్ ఖైదీగా ఉన్న తన మిత్రుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జనగ్ తో పాటుగా విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన సందర్భంలో కొడాలి నాని ఓటమి తరువాత తొలి సారిగా మీడియాతో మాట్లాడారు. అప్పుడు కూడా తన శైలికి భిన్నంగా ఒక్క బూతు మాట కూడా లేకుండా అతి జాగ్రత్తగా మాట్లాడారు.  ఆ సందర్భంగానే జనం తన ఉద్యోగం పీకేశారనీ..అందుకే మాట్లాడటం లేదని చెప్పారు. అక్కడితో ఆగకుండా కేసులంటే భయం లేదని గప్పాలు పోయారు.

అయితే పరిశీలకులు మాత్రం కొడాలి నానిది మేకపోతు గాంభీర్యం మాత్రమేననీ, ఏ క్షణంలో పోలీసులు అరస్టు చేస్తారా అన్న భయం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించిందనీ అప్పట్లో విశ్లేషించారు. ఆ కారణంగానే  జగన్ ఆదేశించినా కూడా తెలుగుదేశం కూటమి సర్కార్ పై చిన్నపాటి విమర్శ కూడా చేయకుండా.. యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.  

ఇదంతా పక్కన పెడితే.. తెలుగుదేశం కూటమి అధకారంలోకి వచ్చిన ఏడాది కాలం పూర్తయినా కొడాలి నాని అరెస్టు కాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు, కబ్జాలు, దౌర్జన్యాలు సహా కొడాలి నానిపై లేక్కలేనన్న ఫిర్యాదులు ఉన్నాయి. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఆయా కేసులలో నిందితులుగా ఉన్న పలువురు అరెస్టయ్యారు. అలా అరెస్టైన వారిలో నానికి అత్యంత సన్నిహితులుగా ఉణ్న వారు కూడా ఉన్నారు. అయినా కొడాలి నాని విషయంలో పోలీసులు అరెస్టు వరకూ వెళ్లకపోవడానికి కారణమేంటన్న చర్చ తెలుగుదేశం శ్రేణుల్లోనే జరుగుతోంది.

అయితే అరెస్టు అవుతారు అన్న సమయంలో కొడాలి నాని అనారోగ్యం కారణంగా తొలుత హైదరాబాద్, ఆ తరువాత మంబై ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్నారు. ఆ తరువాత నుంచీ ఏం మాట్లాడితే ఏ మౌతుందో అన్న భయంతో పూర్తిగా మౌనమునిలా మారిపోయారు. సరిగ్గా ఇక్కడే.. కూటమి ప్రభుత్వం కూడా కొడాలి నాని అరెస్టు విషయంలో తొందర ఎందుకు అన్నట్లు వ్యవహరిస్తున్నది. వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన గుడివాడ నియోజకవర్గంలోనే కొడాలి నాని పట్ల పిసరంతైనా సానుభూతి వ్యక్తం కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో.. అందునా ఆనారోగ్యంతో ఉన్న నానిని అరెస్టు చేసి ఆయనకు జనంలో సానుభూతిని ప్రోది చేసేలా వ్యవహరించడం ఎందుకు? అన్నట్లుగా తెలుగుదేశం కొడాలి నాని విషయంలో వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.