ఏ కులమూ నీదన్నా.. రాహుల్ కు కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
posted on Jul 26, 2025 12:00PM

ఏ కులమూ నీదంటే గోకులమూ మాదందీ.. అన్న పాట ఒకటుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ విషయంలో కిషన్ రెడ్డి వేసిన ప్రశ్న సరిగ్గా అలాగే కనిపిస్తోంది. కుల గణన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల మంటలు రగులుతున్నాయ్. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ప్రెజంటేషన్లో.. ప్రధాని మోడీని కన్వర్టెడ్ బీసీగా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం స్థాయిలోని వ్యక్తి మిడి మిడి జ్ఞానంతో అవాకులు చెవాకులు పేలుతున్నారని తీవ్రంగా మండి పడ్డారు కిషన్ రెడ్డి. అంతెందుకు మీ అధినేత రాహుల్ గాంధీ కులమేదో చెప్పాలని నిలదీశారు.
నిజానికి రాహుల్ గాంధీకి మతమే సరిగా ఉండదు. కులం ఎక్కడి నుంచి వస్తుందన్న కామెంట్ వినిపిస్తోంది. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ సెమీ హిందూ అయినా.. ఆయన వివాహమాడిన సోనియా గాంధీ ఇటలీకి చెందిన ఫక్తు క్రిష్టియన్. అందుకే ఆమె తన కుమార్తెను రాబర్ట్ వాద్రా అనే క్రిష్టియన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా డీప్ గా వెళ్తే.. రాహుల్ నానమ్మ ఇందిరాగాంధీ ఫిరోజ్ ఖాన్ అనే పార్శీని పెళ్లాడినట్టు చెబుతారు. కొందరైతే.. నెహ్రూలు కాశ్మీరీ పండిట్లు కారని.. వారు కూడా ముస్లిములేనని అంటారు.
ప్రస్తుతం కశ్మీర్ సీఎంగా ఉన్న ఒమర్ అబ్ధుల్లా హిందూ అనీ.. ఆ మాటకొస్తే ఎంఐఎం అధినేతలైన ఓవైసీలు కూడా తొలుత రాజస్థాన్ కి చెందిన హిందువులేనని అంటారు. ఇదిలా ఉంటే.. బీసీలు బీసీలని అంతగా గొంతెచించుకుంటున్న కాంగ్రెస్ నాయకులు.. దమ్ముంటే రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగించి.. బీసీ అయిన పొన్నం ప్రభాకర్ ని గానీ ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ ని గానీ ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు.
దీంతో కాంగ్రెస్ అనవసరంగా ఈ గొడవలో చిక్కినట్టయ్యింది. మోడీ ఒక వేళ కన్వర్టెడ్ బీసీ అయినా అది జరిగింది కూడా కాంగ్రెస్ హయాంలోనే... అంటారు కిషన్ రెడ్డి. 1994లో గుజరాత్ లో కాంగ్రెస్ అధి కారంలో ఉన్నపుడు.. మండల్ కమిషన్ నివేదికల ప్రకారం.. మోడీ కులాన్ని బీసీల్లో చేర్చారనీ.. ఆ టైం లో మోడీ కనీసం ఎమ్మెల్యే కూడా కారని అంటారు కిషన్. ఆ తర్వాత కూడా చాలా కులాలను ఎస్సీ ఎస్టీల్లో చేర్చారనీ మరి వారిని కూడా కన్వర్టెడ్ ఎస్సీ ఎస్టీలని అంటారా? అని కూడా ప్రశ్నించారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల జరగాలని బీజేపీ కూడా కోరుకుంటోందని.. అయితే అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజరుద్దీన్, షబ్బీర్ అలీ వంటి వారికి కూడా బీసీ రిజర్వేషన్లు కాకుండా అచ్చమైన బీసీ కులాలకు మాత్రమే ఆ ఫలాలు దక్కాలన్నది తమ అభిమతంగా చెప్పారు కిషన్ రెడ్డి. మరి చూడాలి ఈ బీసీల చిచ్చు ఏ కార్చిచ్చుగా మారుతుందో?