కిరణ్ పార్టీ పేరు ఖరారు

 

ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీ పేరు, కార్యవర్గం సభ్యుల వివరాలు వగైరా ప్రకటించారు. కొత్త పార్టీ పేరు ‘జై సమైక్యాంధ్ర' పార్టీ పేరుని ఎన్నికల కమీషన్ వద్ద రిజిస్టర్ చేయించుకొన్న చుండ్రు శ్రీహరిరావుని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటారని , తాను అధ్యక్షుడుగా ఉంటానని కిరణ్ ప్రకటించారు. కొత్త పార్టీకి "తెలుగువారి ఆత్మగౌరవం'' అనే ఓ ట్యాగ్ లైన్ కూడా చేర్చారు.

 

కాంగ్రెస్ బహిష్కృత యంపీలు-ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బం హరి, హర్షకుమార్, సాయిప్రతాప్ మరియు మాజీ మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణలు ఈ పార్టీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇక లగడపాటి రాజకీయ సన్యాసం స్వీకరించినప్పటికీ ఆయన ఈ కొత్త పార్టీకి సలహాదారుగా ఉంటారని కిరణ్ తెలిపారు. జి. గంగాధర్, తులసీరెడ్డి, రత్నబిందులను పార్టీ కార్యదర్శులుగా ఎంచుకొన్నారు. ఇక కొత్త పార్టీ విధివిధానాల గురించి, ఆశయాల గురించి ఈ నెల 12న రాజమండ్రిలో జరగనున్న బహిరంగ సభలో ప్రకటిస్తానని తెలిపారు.

 

రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ, కాంగ్రెస్ ను వదిలి పెట్టి చంద్రబాబు లేఖ ఇచ్చినందునే రాష్ట్ర విభజన జరిగిందని తన అధిష్టానాన్నివెనకేసుకు వచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా ముందుకు సాగడం కష్టం గనుక, సోనియమ్మకు కవచంలా జైరామ్ రమేష్, దిగ్విజయ్ సింగులను సున్నితంగా విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా తన పార్టీకి ‘జై సమైక్యాంధ్ర’ అని పెట్టుకోవడంపై వస్తున్న విమర్శలకు జవాబుగా గత ఆరేడు నెలలుగా కోట్లాది మంది ప్రజల నిత్యం జపించిన దానినే తన పార్టీ పేరుగా పెట్టుకొన్నానని సర్ది చెప్పుకొన్నారు.

 

సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరూ తన పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేసి, ఇది వాళ్ళ పార్టీయేననే భావన కలిగించే ప్రయత్నం చేసారు. డిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆమాద్మీ పార్టీ పెట్టినప్పుడు కూడా సరిగ్గా ఇటువంటి విధానమే అనుసరించి ప్రజలను ఆకర్షించగలిగారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే పార్టీ పెడుతున్నానని చెప్పుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన చేసిన తన అధిష్టానం పట్ల నేటికీ అదే విధేయత కనబరచడం విడ్డూరంగా ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu