అమృత్ పాల్ సింగ్ సరిహద్దు దాటేశాడా?

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు.   రోజుకో వేషంతో పంజాబ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అమృత్ పాల్ సింగ్ పూటకో వేషం మార్చి దేశంలోనే దర్జాగా తిరుగుతున్నాడన్న వార్తలు ఒకవైపు  దేశం విడిచి ఎప్పుడో పారిపోయాడన్న సమాచారం మరోవైపు జనాలను అయోమయానికి గురి చేస్తోంది.

తాజాగా ఖలిస్థాన్ నేత అమృత్ పాల్ సింగ్ ఢిల్లీలోని ఓ మార్కెట్ లో సంచరిస్తున్నట్లుగా ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. దాంతో అమృత్ పాల్ సింగ్ తన సహచరుడు పాపల్ ప్రీత్ సింగ్ తో కలిసి తలపాగా లేకుండా మాస్కు, నల్ల  కళ్ల అద్దాలు ధరించి దర్జాగా తిరుగుతున్నట్టుగా ఉంది. అయితే దానిని పోలీసులు ధృవీకరించలేదు. యథాప్రకారంగా అమృత్ పాల్ సింగ్ ను త్వరలో పట్టుకుంటాం అన్న అరిగిపోయిన రికార్డునే వినిపించారు.  

అదలా ఉంటే.. అమృత్ పాల్ సింగ్ ను తప్పకుండా పట్టుకుంటామని పంజాబ్, హర్యానా హైకోర్టుకు పంజాబ్ ప్రభుత్వం మంగళవారం( మార్చి 28) తెలిపింది.   అయితే అమృత్ పాల్ సింగ్ పోలీసుల కస్టడీలోనే  ఉన్నాడని, ఆచూకీ చెప్పాలంటూ ఇమాన్ సింగ్ ఖారా అనే న్యాయవాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.  ఇదిలా ఉంటే అమృత్ పాల్ సింగ్ దేశం విడిచి ఎప్పుడో పారిపోయాడనే వాదన కూడా గట్టిగా  వినిపిస్తోంది.  ప్రస్తుతం అతడు నేపాల్ లో ఉన్నాడంటున్నారు.  

మరోవైపు పలు దేశాల్లో ఖలిస్థాన్ సానుభూతిపరులు భారత్ ఎంబసీల మీద దాడులకు దిగుతున్నారు. అమెరికా, యూకే, ఫిలిప్పీన్స్ లో ఖలిస్థాన్ మద్దతుదారులు  తన నిరసనలతో  ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. 70,80వ దశకం తరువాత అణగారిపోయిందనుకున్న ఖలిస్తాన్ ఉద్యమం  మళ్లీ ఇన్నాళ్ల తరువాత మళ్లీ తెరపైకి రావడం నిస్సందేహంగా భారత్ కు ఇబ్బందికరమే.  దీనిని ఆదిలోనే నిరోధించకుంటే.. మరో బ్లూస్టార్ ఆపరేషన్ వంటిది అనివార్యమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.