కేరళ సర్కార్ కు సుప్రీం తలంటు..
posted on May 5, 2017 12:52PM
.jpg)
కేరళ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీ టీపీ సేన్‌కుమార్‌కు తిరిగి పదవి ఇవ్వాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించలేదంటూ ప్రశ్నిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు ధిక్కార నోటీసు కూడా జారీచేసింది. జిషా హత్యకేసు, పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలుడు దుర్ఘటన కేసులను సరిగా విచారించలేదంటూ 2016 మే నెలలో కొత్తగా వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం సేన్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తీసేసి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. దాంతో టీపీ సేన్‌కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక దీనిపై విచారించిన కోర్టు సేన్‌కుమార్ కు అనుకూలంగా తీర్పు నిచ్చింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇంకా సేన్‌కుమార్‌ను డీజీపీ చేయకుండా ఇంకా మీనమేషాలు లెక్కపెడుతుండగా..మరోసారి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో తాము చెప్పినా కూడా ఎందుకు ఆయనను డీజీపీ పదవిలో నియమించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసు జారీ చేసింది. అంతేకాదు రూ. 25 వేల జరిమానా కూడా విధించింది.