కెన్యా ఉగ్రవాదుల దాడిలో 147మంది విద్యార్ధులు మృతి

 

కెన్యా దేశంలో గరిస్సా విశ్వవిద్యాలయ కాలేజీపై నిన్న సోమాలియాకు చెందిన అల్-షబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 147మంది విద్యార్ధులు చనిపోగా మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం మారణాయుధాలతో విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించిన ప్రవేశ ద్వారంవద్ద ఉన్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించారు. ఆ తరువాత లోపల ఉన్న విద్యార్ధులు, అధ్యాపకులలో ముస్లిం మతస్థులను గుర్తించి వారిని బయటకు పంపించి మిగిలిన క్రీస్టియన్ విద్యార్ధులు, అధ్యాపకులను బందీలుగా పట్టుకొని వారిలో 147మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.

 

ఈ సంగతి తెలుసుకొన్న కెన్యా దేశ భద్రతా సిబ్బంది తక్షణమే అక్కడకు చేరుకొని విశ్వవిద్యాలయాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల చెరలో చిక్కుకొన్న 587 మందిని విడిపించగలిగారు. దాదాపు 12గంటలసేపు ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య భీకరపోరు జరిగిన తరువాత లోపల ఉన్న ఉగ్రవాదులందరూ హతం అయినట్లు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడికి పాల్పడింది తామేనని సోమాలియాకు చెందిన అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకొంది.

 

సెప్టెంబర్ 2013లో నైరోబీలో వెస్ట్ గేట్ షాపింగ్ మాల్ పై అల్-షబాబ్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు 67మంది చనిపోగా, ఈసారి ఉగ్రవాదుల చేతిలో ఏకంగా 147మంది మరణించారు. తమ దేశ చరిత్రలో ఇది అత్యంత దురదృష్టకరమయిన రోజని కెన్యా దేశాధ్యక్షుడు ఉహురు కెన్యాట్ట అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu