కేసీఆర్ మద్దతు కోసం కేజ్రీవాల్.. బీఆర్ఎస్ అధినేత స్పందనేంటి?

ఢిల్లీలో తన అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటున్న నేపథ్యంలో  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ బీజేపీయేతర పక్షాల మద్దతు కూడగట్టేందుకు సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు శనివారం (మే 27) రానున్నారు.  పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్స్‌ను బీఆర్ఎస్ వ్యతిరేకించాలని ఆయన కేసీఆర్ ను కోరనున్నారు.

 ఇప్పటికే ఇదే విషయంపై కేజ్రీవాల్  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేలను కలిసి చర్చించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో కూడా సమావేశం కానున్నారు. కాంగ్రెస్ తో సహా బీజేపీని వ్యతిరేకించే పక్షాలన్నీ ఇప్పటికే ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాయి. ఇటీవల సుప్రీం కోర్టు బ్యూరోక్రాట్‌ల బదిలీలు,  నియామకాలపై తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో కేంద్రం పాత్ర కాదు, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వమే  పూర్తి నియంత్రణ కలిగి ఉంటుందని ఆదేశాలు ఇచ్చింది.  దీనిపై ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల ట్రాన్స్‌ఫర్, పోస్టింగ్‌లపై  సర్వాధికారాలు మళ్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

ఢిల్లీలో పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటుందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసి సంగతిని కేజ్రీవాల్‌ గుర్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన ఎనిమిది రోజులకు కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ కి అధికారం కట్టబెట్టిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఆర్జినెన్స్ పార్లమెంట్ లో చట్టం అయితే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది అని కేజ్రీవాల్ అంటున్నారు.

రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. అందుకే అక్కడ పాస్ కావాలంటే ఇతర పార్టీల మద్దతు కావాలి. బీఆర్ఎస్ గతంలో బీజేపీ విషయంలో దూకుడుగా ఉన్నా… ఇటీవల సైలెంట్ అయింది. దీంతో కేజ్రీవాల్  విజ్ణప్తికి బీఆర్ఎస్ స్పందన ఏ విధంగా ఉంటుందన్నదానిపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది.