కేసీఆర్ కు ముచ్చెమటలు పట్టిస్తున్న రోడ్ రోలర్
posted on Oct 24, 2023 4:07PM
తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంటుందన్నప్రచారం విస్తృతంగా ఉంది. బిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ముచ్చెటమటలు పట్టిస్తున్న కాంగ్రెస్ తో పాటు మరో పార్టీ చేరింది. మునుగోడు ఉపఎన్నికల్లో వినిపించిన ఈ పార్టీ పేరు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వినిపించడంతో కెసీఆర్ వణికి పోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు ఉన్న యుగతులసీ పోటీ చేయనుండటంతో కెసీఆర్ భయానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ గుర్తుపై బిఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించి రోడ్ రోలర్ గుర్తును తొలగించాలని కోరి భంగపడింది. చేసేదేమిలేక కెసీఆర్ యుగతులసీ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ తో ప్రగతి భవన్ లో చర్చలు జరిపినట్టు సమాచారం.
ప్రవళిక ఆత్మహత్య తర్వాత నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు కాకుండా ఇదే ప్రగతి భవన్ లో ప్రవళిక కుటుంబసభ్యులను పిలిపించి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి మంత్రులకే అవకాశం లేని నేపథ్యంలో యుగతులసి పార్టీ అధినేతతో చర్చలు జరిపి ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడకుండా కెసీఆర్ శత విధాల ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.
తెలంగాణలో యుగ తులసి పార్టీకి ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇది పీడకలగా మారింది. అంతకుముందు, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలి ఉండే రోడ్ రోలర్‌ను కేటాయించడంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఎన్నికల సంఘం పార్టీ చిహ్నాల కేటాయింపులో డ్రా నిర్వహించి యుగ తులసి పార్టీకి కేటాయించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేయవచ్చని ఈసీ అధికారులు తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ తమ గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్ గుర్తును తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘంకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు గుర్తును తొలగించడం అప్పట్లోసంచలనంగా మారింది. యుగ తులసి పార్టీ అధినేత కొలిశెట్టి శివ కుమార్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం అప్పట్లో ఆయనపై బదిలీ వేటు వేసింది.ఎన్నికల సంఘం యుగ తులసి పార్టీ , అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అనే రెండు రాజకీయ పార్టీల మధ్య రోడ్ రోలర్ గుర్తును కేటాయించేందుకు డ్రాను నిర్వహించింది. డ్రాలో యుగ తులసి పార్టీకి గుర్తును కేటాయించారు.