తెదేపా నేతకి గాలం వేస్తున్న కేసీఆర్

 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ హుషారుగా మొదలుపెట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష’ అటు ఎదుట పార్టీలలోనే కాకుండా స్వంత పార్టీలో కూడా చిచ్చుపెట్టడంతో కొంచెం వెనక్కి తగ్గక తప్పలేదు. అయినప్పటికీ, ఆయన ఆ ఆకర్షణలోనుండి ఇంకా బయటపడనట్లున్నారు. ఆయన చొప్పదండి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా శాసనసభ్యుడు సుద్దాల దేవయ్యతో మొన్నరాత్రి మెదక్ జిల్లాలో జగదేవ్ పూర్ లోగల తన ఫాంహౌసులో దాదాపు అర్ధగంట పైగా రహస్యంగా చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని కేసీఆర్ కానీ, దేవయ్య గానీ దృవీకరించలేదు. వారు దృవీకరించకపోయినప్పటికీ, గతంలో తెదేపా నుండి తెరాసలోకి మారిన హరీశ్వర్ రెడ్డి వ్యతిరేఖిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

 

అదేవిధంగా కేసీఆర్ ఇప్పటికీ కాంగ్రెస్ నేతలతో పూర్తీ ‘టచ్’ లోనే ఉన్నట్లు సమాచారం. ఈ నెల 27న అర్మూరులో పార్టీ 12వ వార్షికోత్సవ సభ నిర్వహిస్తునందున ఆలోగా తెరాసలో ఎవరెవరు చేరబోతున్నారనే విషయం స్పష్టం అయ్యే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికలకు పోటీ చేయనున్న అభ్యర్ధుల మొదటి లిస్టును మేనెలాఖరులోగా విడుదల చేయ నున్నట్లు తెరాస ఇదివరకే ప్రకటించింది గనుక ఆలోగా మిగిలినవారు ఎవరయినా ఉంటే వారు కూడా ఆలోగా తెరాసలో చేరుతారని కేసీఆర్ భావిస్తున్నారు.