మోదీ, షాల‌తో విజ‌య‌సాయి ఏకాంత చ‌ర్చ‌లు.. ఏంటి సంగ‌తి?

బుధ‌వారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. గురువారం ప్ర‌ధాన మంత్రి మోదీని విజ‌య‌సాయి క‌లిశారు. ఈ రెండు మీటింగ్‌లు స‌డెన్‌గా జ‌రిగిన‌వే. ముంద‌స్తు షెడ్యూల్ కానీ, అపాయింట్‌మెంట్ కానీ లేకుండా విజ‌య‌సాయి ఆ ఇద్ద‌రితో ఒంట‌రిగా మాట్లాడారు. ఇది అనూహ్య ప‌రిణామ‌మే. ఇటీవ‌ల కాలంలో ఇలా ఆక‌స్మిక భేటీలు జ‌రిపింది లేదు. ఇప్పుడే స‌డెన్‌గా ఈయ‌న వారిని ఎందుకు క‌లిసిన‌ట్టు? వారు కూడా ఈయ‌న‌తో మాట్లాడాల్సిన అంత అర్జెంట్ మేట‌ర్ ఏముంటుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌.

ఈ వ‌రుస భేటీల‌ను ప‌లు ర‌కాలుగా విశ్లేషిస్తున్నారు. గ‌తంలో సీఎం జ‌గ‌న్‌కే మోదీ, అమిత్‌షాల అపాయింట్‌మెంట్ అంత ఈజీగా దొరికేది కాదు. ఢిల్లీ వెళ్లి ప‌డిగాపులు పడి.. ఒట్టిచేతుల‌తో తిరిగొచ్చిన దాఖ‌లాలు ఉన్నాయి. అలాంటిది, విజ‌య‌సాయిరెడ్డి మాత్రం బుధ‌వారం షాను.. గురువారం మోదీని క‌ల‌వ‌డం కాక‌తాళీయం మాత్రం కాదు. ఇది ప‌క్కా అనూహ్య‌మే అంటున్నారు. ఇంత‌కీ వారి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏమై ఉంటుంద‌నేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ఎప్ప‌టిలానే రొటీన్‌గా.. మ‌ర్యాద‌పూర్వ‌క స‌మావేశం, రాష్ట్ర స‌మ‌స్య‌లు, విభ‌జ‌న హామీలంటూ పైకి ఏదో చెప్పినా.. లోలోన మాత్రం ఇంకేదో జ‌రుగుతోంద‌నే అనుమానం రాక‌మాన‌దు. 

ఇటీవ‌ల జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప‌రిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఏపీలో వైసీపీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింది. ఓటీఎస్‌పై ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తుతోంది. భువ‌నేశ్వ‌రి టాపిక్‌, చంద్ర‌బాబు క‌న్నీటి ఎపిసోడ్‌తో అధికార పార్టీని అంతా అస‌హ్యించుకుంటున్నారు. అటు హైకోర్టులో అక్ర‌మ ఆస్తుల కేసులో కీల‌క వాద‌న‌లు ముగిశాయి. కోర్టు హాజ‌రు నుంచి సీఎం జ‌గ‌న్‌కు మిన‌హాయింపు ర‌ద్దు చేయాల‌ని సీబీఐ బ‌ల‌మైన వాద‌న‌లు చేసింది. ముఖ్య‌మంత్రి హోదాలో సాక్షుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని గ‌ట్టిగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఆ వాద‌న‌లు ముగిశాక‌.. తీర్పు రిజ‌ర్వు చేసింది హైకోర్టు. మ‌ళ్లీ కోర్టుకు హాజ‌రుకాక త‌ప్ప‌దా అనే అనుమానం ఏ1, ఏ2లను వెంటాడుతోంద‌ని అంటున్నారు. 

స‌రిగ్గా.. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ఆస్తుల కేసులో ఏ2, వైసీపీలో నెం.2 గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రిని, ప్ర‌ధాన మంత్రితో వ‌రుస‌గా భేటీ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కేసుల గురించి ఏమైనా మాట్లాడి ఉంటారా? లేక‌, ఇద్ద‌రి అవ‌స‌రాల మేర‌కు పొత్తుల‌పై ఏదైనా చ‌ర్చించారా? అని అనుకుంటున్నారు. రాష్ట్ర స‌మ‌స్య‌లపై మాత్రం వాళ్ల భేటీ జ‌రిగి ఉండ‌ద‌ని అంటున్నారు. ఎందుకంటే, ఏపీ ప్రాబ్ల‌మ్స్ గురించి అయితే.. విజ‌య‌సాయితో పాటు మిగ‌తా వైసీపీ ఎంపీలు కూడా వెళ్లి ఉండేవారు. ఆయ‌న ఒక్క‌రే అంత ర‌హ‌స్యంగా భేటీ కావాల్సిన అవ‌స‌రం ఇంకేదో ఉంద‌ని భావిస్తున్నారు. జ‌గ‌న్‌పై ఉన్న సీబీఐ కేసుల గురించో.. బీజేపీతో అంట‌కాగేందుకో.. విజ‌యసాయి.. మోదీ, షాల‌ను క‌లిసుంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.