సెల్‌ఫోన్ యూజర్లకి శుభవార్త!

మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు. ఇంతలో మీకో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ మీ కాంటాక్ట్ లిస్టులోది కాదు.. నంబర్ మాత్రమే కనిపిస్తుంది. మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అదొక దిక్కుమాలిన ఫోన్. లోన్ ఇస్తామనో, ఇన్సూరెన్స్ తీసుకోమనో, అనాథాశ్రమానికి సాయం చేయమనో ఆ ఫోన్ల సారాంశం. దాంతో మీకు చిరాకు వచ్చేస్తుంది. ఇకపై ఇలాంటి చిరాకు పడాల్సిన అవసరం వుండదు. ఇకపై మీకు ఎవరు ఫోన్ చేసినా, ఆ నంబర్ మీ కాంటాక్ట్స్.లో లేకపోయినా ఫోన్ చేసిన వ్యక్తి పేరు కనిపించేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అన్ని టెలీకాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. అతి త్వరలో మీకు ఫోన్లు వచ్చినప్పుడు ఆ ఫోన్ నంబర్ ఎవరి పేరున వుందో ఆ పేరు కనిపిస్తుంది. ఈ సదుపాయం ప్రస్తుతం ట్రూ కాలర్ లాంటి కొన్ని యాప్స్.ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా కాలర్ ఐడెంటిటీని తెలుసుకునే సదుపాయం వుంది. కానీ, అలాంటి యాప్స్ మీద ఆధారపడటం అంత మంచిది కాదు. మన ఫోన్ మీద ఆ యాప్ పూర్తి అధికారాన్ని సాధిస్తుంది. అది అంత శ్రేయస్కరం కాదు. ఇప్పుడు ట్రాయ్ ఆదేశాలతో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే కాలర్ ఐడెంటిటీ ఫోన్లో తెలిసిపోతుంది. ఈ సదుపాయాన్ని ఒక నెల రోజుల్లోనే హర్యానా రాష్ట్రంలో మొబైల్ కంపెనీలు ప్రారంభిస్తాయి. కొంతకాలం తర్వాత దేశమంతటా ఈ సదుపాయం అమల్లోకి వస్తుంది.