గొడ్డు మాంసం తింటావా? తల తీసేస్తా.. ముఖ్యమంత్రికి వార్నింగ్
posted on Nov 4, 2015 3:32PM

దేశంలో ఇప్పుడు నేతలు ఎక్కువగా మాట్లాడేది గోమాంసం గురించే. దీనిపై నేతలు ఒకరి కంటే ఒకరు రెచ్చిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేశారు. అయితే దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తను ఇప్పటి వరకూ గోమాంసం తినలేదని.. కానీ బీజేపీ నేతలు చేస్తున్న రాద్దాంతం చూస్తుంటే తనకు తినాలనిపిస్తుందని.. ఇప్పటికిప్పుడే తెప్పించుకొని తింటా ఎవరేం చేస్తారు అని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలకు గాను ఓ బీజేపీ నేత అతనిని హెచ్చరించారు. ఈ క్రమంలో శివమొగ్గ మునిసిపల్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు ఎస్.ఎన్.చెన్నబసప్ప మాట్లాడుతూ ‘గొడ్డు మాంసం తింటావా? తిను.. తల తీసేస్తా’ అంటూ ఓ బీజేపీ నేత హెచ్చరిక చేశారు. అయితే చెన్నబసప్ప చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఆయన ఇబ్బందుల్లో పడ్డట్టు తెలుస్తోంది. చెన్నబసప్ప చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఆయనపై వేటు వేయాలని చూస్తుంది. అంతేకాదు ఒక ముఖ్యమంత్రిని ఇంత బహిరంగంగా హెచ్చరించేసరికి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.