నాకు మోదీ మీద ద్వేషం లేదు- కన్నయా కుమార్‌

నేడు హైదరాబాదులో కన్నయా కుమార్‌ జరిపిన పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. దిల్లీ నుంచి శంషాబాదు విమానాశ్రయంలో దిగడంతోనే, తాను రోహిత్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చానని స్పష్టం చేశారు కన్నయ. విమానాశ్రయంలో కన్నయాకు సీపీఐ నేతలు ఘనస్వాగతం పలకడం గమనార్హం. తదుపరి విద్యార్థి నేతలతో మాట్లాడుతూ వీసీ అప్పారావు వల్లే హెచ్సీయూలో సమస్యలు వచ్చాయని కన్నయ్య ఆరోపించారు. వర్సిటీ క్యాంపస్లను యుద్ధరంగాలుగా మార్చారని ఆయన విమర్శించారు. తన ఆదర్శం అఫ్జల్‌గురు కాదు, రోహిత్‌ వేములేనని మరోసారి స్పష్టం చేశారు. తనకి మోదీ అంటే ద్వేషం లేదనీ, అయితే విశ్వవిద్యాలయాలలో కొనసాగుతున్న అణచివేత మీదే తన పోరాటం అనీ పేర్కొన్నారు.

సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నయా ఉపన్యసిస్తుండగా కొందరు ఆయన మీదకు చెప్పు విసిరే ప్రయత్నం చేశారు. కానీ కన్నయా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. తాను గాంధేయవాదిననీ, ఇలాంటి వాటికి భయపడి హైదరాబాదుకి రావడం మానేయననీ చెప్పుకొచ్చారు. ఇక కన్నయా పశ్చిమబెంగాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాన్ని కొట్టివేశారు. విద్యార్థుల హక్కులు, తన చదువు... ఈ రెండే తన లక్ష్యాలని పేర్కొన్నారు. దీంతో కన్నయా మీద కోటి ఆశలు పెట్టుకున్న కమ్యూనిస్టులని నిరాశ పరిచినట్లైంది.